తీవ్రవాదుల ఏరివేత చర్యల్లో భారత్ సైన్యానికి మరో గొప్ప విజయం దక్కింది. జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్ ఖలీద్‌ను ఎన్కౌంటర్లో భారత భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో జరిగింది. సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ ఆపరేషనల్ హెడ్, కీలక ఉగ్రనేత అబు ఖలీద్‌ను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
బారాముల్లాలోని లాదోరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతాసిబ్బంది ఉగ్రవాదిని మట్టుబెట్టారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలీద్ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది. ఉత్తర కాశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక ఇతడి హస్తం ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌కు కొద్ది గంటల ముందే బుద్గాం జిల్లాలోని ద్రాంగ్ గ్రామంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.