ఇటీవలె వివాదంలో చిక్కుకున్న సహరా సంస్థల ఆస్తులను వేలంలో దక్కించుకునేందుకు ప్రముఖ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దాదాపు రూ.7,400 కోట్ల విలువ చేసే సుమారు 30 సహరా ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ప్రముఖ దిగ్గజ సంస్థలైన టాటా, గోద్రెజ్, అదాని, పతంజలి తదితర సంస్థలు పోటీపడుతున్నాయి. సహరా ప్రాపర్టీల్లో ఎక్కువగా స్థలాలే ఉండటంతో ఒమాక్సే, ఎల్డెకో వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు, ఇండియన్ ఆయిల్ వంటి పలు ప్రభుత్వరంగ దిగ్గజాలు కూడా ఆసక్తి వ్యక్త పరచినట్టు సంబందిత వర్గాలు తెలియజేశాయి.
ఇదే క్రమంలో లక్నోలోని సహరా హాస్పిటల్ పై అపోలో హాస్పిటల్స్ కన్నుపడింది. ఇప్పటికే తాము ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈవోఐ) సమర్పించినట్లు అపోలో హాస్పిటల్స్ ప్రతినిది తెలిపారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ "నైట్ ఫ్రాంక్ ఇండియా" సహరా ప్రాపర్టీల వేలంను నిర్వహించనుంది. వేలం ప్రకటనకు భారీ స్పందన లభించిందని, సుమారు 250 పైచిలుకు ఈవోఐ లు వచ్చాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ప్రాపర్టీల విక్రయం ద్వారా తొలి విడత నిధులు జూన్ 17 నాటికి, మొత్తం సుమారు రూ.7,400 కోట్లు చేతికి రాగలవని సహరా సంస్థ భావిస్తుంది.