దేశీయ మార్కెట్లు నేడు అంత ఆశాజనకంగా ముందుకు సాగలేదు . అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలతో బుధవారం నాటి ప్రీ ట్రేడింగ్ సూచీలు రికార్డు స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. అయితే ట్రేడింగ్ ఆరంభంలో మాత్రం కాస్త తడబడ్డాయి.
జులై డెరివేటివ్ సిరీస్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఈ ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లే కన్పించినా.. చివర్లో లోహా, మౌలిక, విద్యుత్, ఆటోమొబైల్, ఐటీ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
దీంతో ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు ఆరంభ లాభాల్లో కొంత కోల్పోవాల్సి వచ్చింది. మార్కెట్ ముగిసే సయమానికి సెన్సెక్స్ స్వల్పంగా లాభపడినప్పటికీ.. నిఫ్టీ నష్టాలను చవిచూసింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 36,858 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది. నిఫ్టీ మాత్రం 2 పాయింట్ల నష్టంతో 11,132 వద్ద స్థిరపడింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.71గా కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్బీఐ, యూపీఎల్ లిమిటెడ్, అదానీపోర్ట్స్ షేర్లు లాభపడగా.. ఎన్టీపీసీ, లుపిన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఆల్ట్రాటెక్సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. మొత్తంగా ఈ రోజు మార్కెట్ మిశ్రముగా ముగిసాయి.