//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు భారత్, న్యూజిలాండ్‌ చివరి టి20..గెలిస్తే సిరీస్‌ సొంతం

Category : sports

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ తో కప్పుకొట్టిన భారత్..టీ20 సిరీస్ పై కన్నేసింది. తిరువనంతపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో మంగళవారం (నవంబర్-7) భారత్, న్యూజిలాండ్‌ మధ్య చివరిదైన మూడో టి20 మ్యాచ్‌ జరగనుంది. సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్న స్థితిలో ఈ మ్యాచ్‌ ఫలితం సిరీస్‌ విజేతను కూడా నిర్ణయిస్తుంది. అందుకే భారత్‌లో కివీస్‌ పరిమిత ఓవర్ల పర్యటనకు ముగింపు ఇస్తున్న ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది.

కుల్దీప్‌కు చాన్స్‌!

సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత్‌కు న్యూజిలాండ్‌ ఎంత ప్రమాదకారినో రెండో మ్యాచ్‌లో గానీ అర్థం కాలేదు. 197 పరుగుల స్కోరుతో ఆ జట్టు విసిరిన సవాల్‌ను భారత్‌ అధిగమించలేకపోయింది. కోహ్లి పోరాటాన్ని మినహాయిస్తే అక్కడ జట్టు బ్యాటింగ్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. నిజానికి కోహ్లి ఐదుగురు బౌలర్ల వ్యూహం కారణంగా ఆ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మన్‌ తగ్గిన లోటు కనిపించింది. ఈ సారి దానిని టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి. సిరీస్‌ గెలవాలంటే కోహ్లి ఒక్కడే కాకుండా ఓపెనర్లిద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్‌కు మరో అవకాశం ఖాయం. అయితే పాండ్యా బ్యాటింగ్‌ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియాతో చివరి వన్డే తర్వాత అతని మెరుపులు అసలు కనిపించలేదు. అయితే కెప్టెన్‌ కోహ్లి విశ్వాసం చూరగొన్న అతను ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో కివీస్‌ పరుగులు సాధించినా… ముగ్గురు ప్రధాన బౌలర్లు బుమ్రా, భువీ, చహల్‌ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. కేవలం అక్షర్, కొత్త ఆటగాడు సిరాజ్‌లపై మాత్రమే ప్రతాపం చూపించి ప్రత్యర్థి భారీ స్కోరు చేయగలిగింది. బ్యాటింగ్‌ పిచ్‌పై దురదృష్టవశాత్తూ రాణించలేకపోయిన సిరాజ్‌కు మరో అవకాశం ఇస్తారా లేక కివీస్‌ను ఇబ్బంది పెట్టేందుకు చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ను తీసుకుంటారా చూడాలి.