తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైభవంగా సాగుతోంది. మహా సంప్రోక్షణలో భాగంగా మొదటి రోజు కళాకర్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభంలోకి ఆవాహన చేశారు. శ్రీవారి మూలమూర్తికి తల, నుదురు, ముక్కు, నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి, కటి, మోకాలు, పాదాల్లో 12 జీవ స్థానాలు ఉంటాయని.... ఒక్కో జీవస్థానానికి 4 కళలు చొప్పున మొత్తం 48 కళలను కుంభంలోకి ఆవాహన చేశామని ఋత్వికులు తెలిపారు.
ఈ కుంభాలను యాగశాలకు తరలించి వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సంప్రోక్షణలో రెండోరోజులో భాగంగా నేడు విశేష హోమాలతో పాటు అష్టబంధన ద్రవ్యం తయారుచేస్తారు. గర్భాలయంతో పాటు ఉప ఆలయాల్లో అష్టబంధనాన్ని సమర్పిస్తారు. ఈ అష్ట బంధనాన్ని ఎనిమిది రకాల ద్రవ్యాలతో తయారుచేస్తారు. శ్రీవారి సన్నిధిలోని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా, ఉప దేవాలయాలలో ఈ అష్టబంధనాన్ని సమర్పిస్తారు.
ఈరోజు 35వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గత రెండు రోజుల కంటే ఈరోజు భక్తుల రద్దీ కొంత పెరిగింది.