పెళ్ళికి వెళ్ళాలని ముందుగానే బస్ టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ అనుకోని అవాంతరం వచ్చి ప్రయాణం వాయిదా వేసుకున్నారు. అప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎంతోకొంత రుసుము వదులుకోక తప్పదు. అలాగే సినిమాకి ఆదివారం టికెట్లు తీసేసుకున్నారు. కానీ అర్జంటుగా వేరేఊరు వెళ్ళాల్సి వచ్చింది. టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాలంటే సినిమా థియేటర్‌కి వెళ్ళి అక్కడ ఎవరికో ఒకరికి అమ్మి రావాలి. లేదంటే వాటిని వదులుకోవాల్సిందే! సినిమా ఉండదు..డబ్బులకి డబ్బులూ నష్టమే.
అలాగే ఓచర్స్ కూడా! అందుకే అలా కాకుండా మనం ఉపయోగించని టికెట్లను నిమిషాల్లో ఉన్నచోటు నుంచే వేరొకరికి అమ్మే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది? సింగిల్ క్లిక్ ద్వారా ఓచర్ రీసేల్ చేసే అవకాశమే ఉంటే ఎంత బావుంటుంది? మనం పెట్టిన డబ్బులు తిరిగి మన జేబులోకి వస్తే?
సరిగ్గా ఈ కాన్సెప్ట్ మీదనే వర్కవుట్ చేశాడు నవీన్ ధన్‌గోపాల్. ఆ వర్కవుట్ ఫలితమే కెన్సెల్ స్టార్టప్! లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయిన టికెట్లను అమ్మిపెట్టే ప్లాట్‌ఫాం. అంటే ఎవరికైనా చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ అయితే, ఈ వేదిక ద్వారా ఆ టికెట్‌ని వేరొకరితో ఎక్ఛ్సేంజ్ చేసుకోవచ్చన్నమాట. అది సినిమా టికెట్ గానీ, ఈవెంట్ ఓచర్ గానీ, బస్సు, రైలు టికెట్ గానీ. మన డబ్బులు తిరిగొచ్చినట్టూ ఉంటుంది. అదేసమయంలో వేరొకరికి సాయం చేసినట్టూ ఉంటుంది. రెండువైపులా లాభం. ఈమధ్యనే అంటే జనవరి 2న ఈ కెన్సెల్ పనిచేయడం ప్రారంభించింది.
ప్రయాణం అంటేనే ఒక్కోసారి అనుకోకుండా జరుగుతుంది. ప్లాన్ ప్రకారమూ ఉంటుంది. ఈ రెండు కేటగిరీల్లో ఉండే జర్నీలో.. టికెట్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటి సమస్యకు కెన్సెల్ లైఫ్‌లైన్‌గా పనిచేస్తుంది. ఇప్పటివరకైతే కెన్సెల్ ఫ్రీ ప్లాట్‌ఫాం. భవిష్యత్తులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, డ్రాప్ బాక్సుల రూపంలో పెయిడ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు.
ప్రస్తుతానికిది సెల్ఫ్ ఫండెడ్ వెంచర్. మార్కెట్ రెస్పాన్సును బట్టి ముందుకు అడుగువేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ స్టార్టప్ సినిమా టికెట్లు, ఈవెంట్ ఓచర్లు, బస్సు, జనరల్ కేటగిరీల్లో ఉంది. మున్ముందు టికెటింగ్ పోర్ట్‌ఫోలియోలు పెంచాలని చూస్తున్నారు. హోటల్స్, ఎయిర్‌లైన్స్ వంటి సేవలన్ని లైన్లోకి తేవాలని భావిస్తున్నారు.