శ్రీనగర్ : జమ్ము-కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ రెండో వర్థంతి సందర్భంగా ఆందోళనకారులు చేపట్టిన సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్భంగా రాళ్ళు రువ్వుతున్న ఆందోళనాకారులను అదుపు చేసేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక యువతితో సహా ముగ్గురు పౌరులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కుద్వాని జిల్లాలో హవూరా, మిష్పోరా గ్రామాలలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో స్థానికులు భద్రతా బలగాలపై రాళ్లురువ్వడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఆందోళనలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా కుల్గాం, అనంతనాగ్, షొపియాన్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు.
బుర్హాన్ వనీ వర్థంతి సందర్భంగా ఆందోళనకారులు రెండు రోజులపాటు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో భద్రతా బలగాలు ముందు జాగ్రత్తచర్యగా దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా, నౌహట్టా, మైసుమా పోలీస్‌స్టేషన్ ప్రాంతాలలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టింది. బుర్హాన్‌వనీ సొంత పట్టణమైన ట్రాల్లో కర్ఫ్యూను విధించినట్లు అధికారులు తెలిపారు. 2016, జులై 8న అనంతనాగ్ జిల్లాలో భద్రతా బలగాల ఎన్కౌంటర్లో వనీ మృతిచెందిన సంగతి తెలిసిందే.
అనంతరం చెలరేగిన ఉద్రిక్తలు, అల్లర్లలో 85 మంది మృతి చెందగా, వెయ్యిమందికి పైగా గాయాలపాలైన సంగతి తెలిసిందే. కాగా, దుక్త్రాన్-ఇ-మిలెట్ (డిఇఎమ్)కు అధ్యక్షురాలైన అసియా ఆండ్రాబిని జాతీయ దర్యాప్తు సంస్థకు పది రోజుల కస్టడీ నిమిత్తం ఢిల్లీ పంపించి నందుకు నిరసనగా వేర్పాటువాదులు ఆందోళనకు పిలుపునిచ్చారు. లాల్ చౌక్‌లో దుకాణాలు, ఇతర సంస్థలు మూతపడ్డాయి. ఇతర ప్రాంతాలు యథావిథిగా తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.