చనిపోయినవారిని స్మశానాలకు తరలించి పూడ్చి పెట్టడం లేదా దహనం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే, ఇటలీకి చెందిన అన్నా టిటెల్లీ, రౌల్ బ్రెట్జెల్ అనే డిజైనర్లు ‘‘మీరు ప్రేమించే వ్యక్తులను చెట్ల రూపంలో చూసుకోండి’’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఓ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు.వ్యక్తి చనిపోయిన తర్వాత శవ పేటికలో పెట్టి భూమిలో పాతిపెడతారు. ఇందుకు స్మశానంలో స్థలం కూడా అవసరం. అయితే తక్కువ స్థలంలోనే భౌతిక కాయాలను పూడ్చిపెట్టేందుకు అనువైన శవపేటికను డిజైనర్లు సిద్ధం చేశారు. గుడ్డు ఆకారంలో ఉండే ఈ శవపేటికలో పార్థివ శరీరాన్ని ఉంచి భూమిలో పాతిపెడతారు.
అలా, భూమిలో పాతిపెట్టిన క్యాప్సుల్ పై మీరు కోరిన చెట్టు విత్తనం లేదా మొక్కను ఉంచుతారు. అది క్రమేనా క్యాప్సుల్‌ను అంటిపెట్టుకుని పెరుగుతుంది. వాటి వేర్లు క్యాప్సుల్‌లోకి చేరి శరీరంలో ఉండే అన్ని రకాల పోషకాలను గ్రహిస్తూ ఎదుగుతుంది. అంటే, వ్యక్తి శరీరంలోని ప్రతి అణువు చెట్టులోకి చేరుతుందన్నమాట.వీరి ఆవిష్కరణకు ఇటలీతోపాటు అమెరికా, బ్రిటన్ దేశాల్లో మాంచి డిమాండు నెలకొంది. దీనివల్ల స్మశానాలు కాంక్రీటు దిమ్మెలతో నిండిపోకుండా పచ్చదనం నెలకొంటుందని డిజైనర్లు చెబుతున్నారు. ఈ విధానం మన దేశంలో కూడా అమలైతే స్మశానాలన్నీ పచ్చదనంతో నిండిపోతాయి కదూ.