//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెన్నై జట్టుకి బలం వీరే

Category : sports

ఐపియల్ కప్ ని మూడో సారి ఎగరేసుకుపోయిన చెన్నై జట్టులోనే ఏదో మాయ ఉందేమో.. లీగ్‌ ముంగిట ఎంత ప్రతికూలంగా మాట్లాడుకున్నా.. మైదానంలోకి రాగానే వాళ్ల ఆటే వేరుగా ఉంటుంది. ఈసారి కూడా అదే జరిగింది. ముసలి జట్టు అని ఎద్దేవా చేసిన వాళ్ళే ఆ జట్టు ప్రదర్శన చూసి సైలెంట్ అయిపోయారు.‘‘2017 ప్రదర్శన నా ఐపీఎల్‌ కెరీర్లోనే అత్యంత పేలవం’’ అన్న వాట్సన్‌.. ఈసారి చెన్నైకి ఆడుతూ ఒకటికి రెండు శతకాలు బాదాడు. 39.64 సగటుతో 555 పరుగులు చేశాడు. ఫైనల్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు.

ఇక ప్రదర్శన పడిపోవడంతో ముంబయి మాకొద్దంటూ వదిలేసిన అంబటి రాయుడు.. చెన్నై తరఫున చెలరేగిపోయాడు. తన ఐపీఎల్‌ కెరీర్లోనే ఎన్నడూ లేని స్థాయిలో గొప్ప ప్రదర్శన (43 సగటుతో 602 పరుగులు) చేశాడు. మరోవైపు ధోని (75.83 సగటుతో 455 పరుగులు) తడబాటు వీడి కొన్ని మ్యాచ్‌ల్లో చెలరేగిపోయాడు. ఒకప్పటి తన ఆటను గుర్తు చేశాడు. ఈ సీజన్లో చివరి ఓవర్లలో ధోని 148 బంతుల్లోనే 297 పరుగులు చేయడం విశేషం.

ఆ ఓవర్లలో అతడి సగటు 100కు పైనే ఉంది. ఇక చాహర్‌ (27.8 సగటుతో 10 వికెట్లు) అనే అనామకుడైన బౌలర్‌.. చక్కటి ప్రదర్శన చేశాడు. లీగ్‌లో ఆలస్యంగా అవకాశాలందుకున్న ఎంగిడి (14.18 సగటుతో 11 వికెట్లు) చెన్నైకి భలేగా కలిసొచ్చాడు. ఇక పాత కాపులు రైనా, బ్రావో కూడా నిలకడగా రాణించి జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇలా జట్టులో ప్రతి ఒక్కరు అంచనాలకు మించి రాణించారు.