బ్రిటన్లో ఓ వైపు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రధాని థెరెసా మే చేస్తుండగా, మరోవైపు మూడేండ్ల ముందే మధ్యంతర ఎన్నికలకు వెళ్లి, పార్టీని మైనారిటీ లో పడవేసిన ఆమెపై పార్టీ లోపల, బయట రాజీనామా చేయమని వత్తిడులు పెరుగుతున్నాయి. మూడేండ్లు ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందని పలువురు సొంత పార్టీ సభ్యులు ఆమె పై దుమ్మెత్తిపోస్తున్నారు.
కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది థెరెసా స్థానంలో వేరొకరిని నియమించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని థెరెసా సలహాదారులు నిక్ తిమోతీ, ఫియోనా హిల్ రాజీనామా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వీరిద్దరే థెరెసాపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు పొందలేకపోవడంతో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఇప్పుడు మద్దతు ఇవ్వడానికి డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ) సుముఖత వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. ప్రభుత్వంలో చేరకుండా బయట అవకాశం ఉంది. అందుకు షరతులు ఏమిటో తెలియటం లేదు. పైగా, స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలు, గర్భస్రావం వంటి అంశాలను వ్యతిరేకించే డీయూపీ మద్దతుతో థెరెసా ప్రభుత్వం కొనసాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వంలో పనిచేసిన కీలకమైన మంత్రులందరికీ తిరిగి అవే శాఖలను కేటాయించాలని థెరెసా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది జూనియర్ మంత్రులు ఓటమి చెందడంతో వారి స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేసేందుకు ప్రధాని కసరత్తు చేస్తున్నారు.