Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉగాది పండుగ విశిష్టత, విశేషాలు...!

Category : state

ఉగాది అనగా ఉగస్య -ఆది "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థం.  'ఆది' అనగా మొదలు. కావున ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజుగా ఉగాది కి పేరు. యుగము అనగా రెండు లేక జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది.ఈ రోజుకి వసంత కాలమునకు ఎంతో అవినాభావ సంబంధము ఉంది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణ,ఇతిహాసాలు చెబుతున్నాయి.

వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రమ్మకి ఇవ్వడం జరిగింది. ఈ శుభ పరిణామమని ప్రతీకగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని మరో ప్రతీక. అలాగే శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట అన్ని విధాలా శుభం. అందుకే ఆ రోజు తెల్లవారు జామునే నిద్ర లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరుచు కుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తల స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ఎంతో ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.