భారతీయ నావికాదళం బలోపేతమయ్యేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ భారీ నిర్ణయం తీసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రూ.21,738 కోట్లతో 111 హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనపై మంగళవారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఫ్లై ఎవే కండిషన్‌పై 16 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు, 95 హెలికాప్టర్లను మన దేశంలోనే తయారు చేసేందుకు ఆమోదం లభించింది. వ్యూహాత్మక భాగస్వామ్య పద్ధతిలో వీటిని సేకరిస్తారు. హెలికాప్టర్లను తయారు చేసే విదేశీ సంస్థ, భారతదేశానికి చెందిన రక్షణ రంగ సంస్థ కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో పాల్గొనే విదేశీ సంస్థ కోసం అన్వేషణ ప్రారంభమైంది.