//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజధాని లేని అందాల చిట్టి దేశం

Category : world

భారతదేశానికి రాజధాని ఏది అంటే న్యూఢిల్లీ అని టక్కున సమాధానం చెప్పేస్తాం. యుఎస్‌ఎ క్యాపిటల్‌ గురించి అడిగితే వాషింగ్టన్‌ డిసి అనేస్తాం. ఇక ఆస్ర్టేలియా రాజధాని గురించి ప్రశ్నిస్తే.. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అయినా కాన్‌బెర్రా అని గుర్తుచేసుకుంటాం. మరి అసలు రాజధాని నగరం లేని దేశం పేరు చెప్పమంటే మాత్రం అయోమయంలో పడిపోతాం. ఈ ప్రపంచంలో అలాంటి దేశం కూడా ఒకటుందా అని బోలెడు ఆశ్చర్యపోతాం. మరి ఆ దేశానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందామా..! 

ప్రపంచంలో అధికారికంగా రాజధాని నగరం అంటూ లేని దేశం నౌరూ ఒక్కటే. 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, చిన్న బంగాళదుంప ఆకారంలో ఉండే ఈ దేశం మధ్య పసిఫిక్‌ సముద్రంలో ఉన్న ద్వీప సముదాయాల్లో ఒకటి. విస్తీర్ణ పరంగా మూడో అతి చిన్న దేశం. అతి తక్కువ జనాభా ఉన్న దేశాల జాబితాలో రెండోది (మొదటిది వాటికన్‌ సిటీ). అత్యంత ఆహ్లాదకరమైన ద్వీపంగా నౌరూ ప్రఖ్యాతి పొందింది. ఈ దేశానికి ప్రత్యేకంగా రక్షణ వ్యవస్థ అంటూ ఏమీ లేదు. దీని రక్షణ బాధ్యతలను ఆస్ర్టేలియా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రాంతంలో సముద్ర పక్షుల విసర్జితాలు గుట్టలుగా పేరుకుపోయి కాలక్రమంలో అవి పాస్ఫేట్‌ నిల్వలుగా రూపాంతరం చెందాయి. వీటి కారణంగా నౌరూ ఒకప్పుడు అత్యంత ధనిక దేశంగా పేరొందింది. అయితే రానురాను వాటి నిల్వలు క్షీణించడంతో ఈ దేశ ఆర్థిక పరిస్థితి కూడా చతికిలబడింది. ఈ దేశ జనాభా సుమారు 10 వేలు. కామన్వెల్త్‌ గేమ్స్‌, ఒలింపిక్స్‌లో నౌరూ ప్రాతినిధ్యం తప్పకుండా ఉంటుంది. 

 బ్రిటన్‌ నావికుడు జాన్‌ ఫియర్న్‌ 1798లో ఈ ద్వీపంపై కాలుమోపాడు. అయనే దీనికి ప్లజెంట్‌ ఐలాండ్‌గా నామకరణం చేశాడు.  పాస్ఫేట్‌ మైనింగ్‌, ఆఫ్‌షోర్‌ బ్యాంకింగ్‌, కొబ్బరి ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఇక్కడి ప్రజలకు ప్రధాన జీవనాధారం. 

ఆస్ట్రే‌లియన్‌ కాలనీగా ఉన్న నౌరూ 1968లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది.  బ్రిటన్‌, ఆస్ట్రే‌లియా, న్యూజిలాండ్‌ దేశాల కన్సార్టియం ఈ దేశంలో 1906లో మైనింగ్‌ మొదలుపెట్టింది. ఇప్పటికి దాదాపు 90 శాతం ప్రాంతంలో మైనింగ్‌ పూర్తిచేసింది. 

 పసిఫిక్‌ మహాసముద్రంలో పాస్ఫేట్‌ నిల్వలు అత్యధికంగా ఉన్న ద్వీపాల్లో మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో ఓషన్‌ ఐలాండ్‌, మకాటియా ద్వీపాలున్నాయి. 

 నౌరూలో యూఎస్‌ ఎంబసీ లేదు. ఫిజీ దేశానికి రాయబారిగా నియమితుడైన వ్యక్తి నౌరూ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తాడు. 

 ఇక్కడి ప్రజలు ఊబకాయులు. ప్రపంచంలోనే అత్యధిక శాతం ప్రజలు ఒబెసిటితో ఉన్న దేశం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సగటు బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎంఐ) 18.5 & 24.9 అయితే నౌరూ దేశీయుల సగటు బిఎంఐ 34 & 35. 

 ప్రపంచంలో అతి తక్కువమంది పర్యాటకులు సందర్శించే దేశం కూడా నౌరూనే కావడం విశేషం. 

 ఈ దేశంలో పర్యాటకులు విడిది చేయడానికి ఉన్న హోటళ్లు రెండు మాత్రమే. 

 ఈ దేశ మొత్తం మీద ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉంది. రోడ్డు మార్గం మీదుగా దేశాన్ని చుట్టి రావడానికి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. ఇక ఇక్కడి రైల్వే లైన్‌ పొడవు 5 కిలోమీటర్లు మాత్రమే. మైనింగ్‌ ద్వారా లభించిన పాస్ఫేట్‌ను ప్లాంట్లకు తరలించడానికి ఈ మార్గంలో రైళ్లను నడుపుతారు. 

 ఇక్కడి ప్రజల్లో 93 శాతం మంది నౌరుయన్‌ భాష మాట్లాడతాను. దీనితోపాటు ఇంగ్లీష్‌ కూడా వాడుకలో ఉంది.  నౌరూ దేశంలో ప్రజలకు ఆదాయపు పన్నుతో సహా ఎటువంటి పన్నుల బెడద లేదు.  5-16 సంవత్సరాల పిలలు పాఠశాలకు వెళ్లడం తప్పనిసరి. ఇక్కడ చదువుకోవడానికి ఎవరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంతా ఫ్రీ.. 

ఇక్కడ మొత్తం 12 తెగలవారు నివసిస్తున్నారు. ప్రతి తెగకూ ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంటుంది. దీని ద్వారా వారు ఏ తెగకు చెందినవారో గుర్తించడం సులభమవుతుంది. శిశువులకు మాతృ తెగను వర్తింపజేయడం ఇక్కడి ఆచారం. అలాగే ఒకే తెగకు చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకోవడం నిషిద్ధం.