ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న జీ-20 సదస్సు సందర్భంగా దాడులు జరిగే అవకాశాలు వున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని సైనిక, భద్రతా బలగాలకు జర్మనీ సైన్యం హెచ్చరిక జారీ చేసింది. తీవ్రవాదుల దాడులకు లక్ష్యంగా మారే ప్రమాదముందని నిఘా వర్గాల నుండి సమాచారం అందినందున అప్రమత్తంగా వుండాలని మిలటరీ సిబ్బందిని రక్షణ, హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
కాగా, గత వారాంతం నుండే కొన్నిచోట్ల నిరసనలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జీ-20 కూటమి పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తోందని, అందుకే తాము వ్యతిరేకిస్తున్నామని ఆందోళనకారులు పేర్కొంటున్నారు.
సిబ్బంది వసతికి ఉపయోగిస్తున్న మిలటరీ స్థావరాల భద్రతపై రక్షణ శాఖ అధికారులు ఆందోళన వ్యకం చేస్తున్నారు. వీటిని దిగ్బంధించే ప్రమాదం ఎక్కువగా వుందని వారు పేర్కొంటున్నారు. సదస్సు జరిగే ప్రాంతానికి దారి తీసే రోడ్లన్నింటినీ దిగ్బంధించాలని, సదస్సును విఫలం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.