//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోల్‌కతాలో ఉద్రిక్తత..!

Category : national

పశ్చిమ్‌ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రద్దీగా ఉండే చింగ్రిఘట క్రాసింగ్‌ వద్ద బస్సు సిగ్నల్‌ జంప్‌ చేసి ఇద్దరు యువకులపైకి దూసుకుపోవడంతో వారు మరణించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళన చేపట్టారు.

మృతులు సంజయ్‌ బసు, బిస్వజిత్‌ భునియాలను కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ఆ ప్రాంతంలో సరైన భద్రత చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహంతో స్థానికులు గుమిగూడి ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులపై దాడి చేశారు.

చనిపోయిన విద్యార్థుల ఇళ్లు బైపాస్‌ సమీపంలోనే ఉండడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు టియర్‌ గ్యాస్‌ ఉపయోగించారు. లాఠీ ఛార్జ్‌ చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది.

స్థానికులు బస్సులకు నిప్పంటిస్తుంటే పోలీసులు ఏమీ చేయలేకపోయారు. నాలుగు బస్సులకు నిప్పంటించి పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక యంత్రంపైనా ఆందోళనకారులు దాడి చేశారు. ఘటనలో పలువురు పోలీసులు గాయాలపాలయ్యారు.

ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులకు దాదాపు మూడు గంటలు పట్టింది. ఉద్రిక్తతలు నెలకొన్న రహదారి నగరంలో ఐటీ పరిశ్రమలు ఉన్న సాల్ట్‌ లేక్‌ ప్రాంతానికి అనుసంధానమైంది. కొన్ని గంటల పాటు రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ట్రాఫిక్‌ పోలీసు ఉన్నారని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరగకుండా చూస్తామని పోలీసులు గతంలో హామీ ఇచ్చారని అయినా పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుజిత్‌ బసు ఘటనాస్థలానికి చేరుకుని సీనియర్‌ పోలీసు అధికారులు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు.

తాను స్థానికులతో మాట్లాడానని, రద్దీగా ఉండే రోడ్డు దాటడానికి సబ్‌వే కావాలని కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. మరణించిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. ఇటీవల పశ్చిమ్‌బంగలో పలు బస్సు ప్రమాదాలు జరిగాయి. జనవరి 29న ముర్షీదాబాద్‌ జిల్లాలో బస్సు నదిలో పడి 44 మంది ప్రాణాలు కోల్పోయారు.జనవరి 17న ఖరగ్‌పూర్‌ ప్రాంతంలో బస్సు నదిలో పడి 8 మంది చనిపోయారు.