ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆరుగురు ఎవరెస్టు శిఖరాన్ని ఈ సీజన్లో లో మొదటగా అధిరోహించి రికార్డు సృష్టించారు. 8848 మీటర్ల ఎత్తైన ఈ మంచుకొండ పైకి ఆరుగురు విద్యార్థులు శనివారం ఉదయం చేరుకున్నారు. ప్రస్తుత సీజన్లో లో పర్వత శిఖరానికి చేరుకున్న తొలి వ్యక్తులు వీరే కావడం విశేషం. వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారు కావడం గమనార్హం.
సాహస క్రీడల్లో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే వీరికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు అవసరమైన శిక్షణ, ఆర్థిక సహాయాన్ని అందించింది. రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విభాగం ఆధ్వర్యంలో 13 మంది, యువజన సంక్షేమ విభాగం తరఫున ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేశారు.
మొత్తం 19 మంది ఏప్రిల్ 8వ తేదీన విజయవాడ నుంచి బయలుదేరి ఖాట్మండ్ మీదుగా ఏప్రిల్ 13న టిబెట్ రాజధాని లాసాకు చేరుకున్నారు. అక్కడి నుంచి వీరంతా మంచుకొండలపై ప్రయాణం ప్రారంభించి తొలుత 5,182 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌నకు చేరుకున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో అక్కడి నుంచి 6,492 మీటర్ల ఎత్తులో ఉన్న అడ్వాన్స్డ్ బేస్ క్యాంపు వరకూ 19 మంది కలిసే వెళ్లారు.
అక్కడి నుంచి రెండు బృందాలుగా విద్యార్థులను విభజించారు. తొలుత ఆరుగురిని ఒక బృందంగా ఎవరెస్ట్‌కు పంపించారు. వీరిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన వూయక కృష్ణారావు(శ్రీకాకుళం), కుంజా దుర్గారావు(తూర్పుగోదావరి), జి.సురేష్‌బాబు(కర్నూలు), యువజన సంక్షేమ విభాగం తరఫున వెళ్లిన సత్యారావు కారె(విశాఖపట్నం), సుందరాన నాగరాజు(విశాఖపట్నం), తమ్మినేని భరత్(కర్నూలు) ఉన్నారు.
ఆరుగురు విద్యార్థులు ఒకేసారి ఎవరెస్ట్‌ను అధిరోహించడం ఇదే తొలిసారి. ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు 45 రోజుల సమయం పడుతుండగా వీరు కేవలం 30 రోజులలోనే అధిరోహించడం విశేషం.