//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికాలో తెలుగు విద్యార్థి హత్య ..!

Category : national

అ మెరికాలో దుండగుల దుశ్చర్యకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. కన్సాస్‌ నగరంలో ఒక రెస్టారెంటులో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన శరత్‌ కొప్పుల (26) తీవ్రంగా గాయపడ్డాడు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న శరత్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. శరత్‌ ఆరు నెలల క్రితం మిస్సోరి విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు) కన్సాస్‌లోని ఓ హోటల్‌లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. పోలీసులు వెంటనే శరత్‌ను ఆసుపత్రికి తరలించారు. శరత్‌పై కాల్పులు జరిగాయని, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అమెరికాలో ఉన్న స్నేహితుడు బంధువులకు శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సమాచారం అందించారు. శరత్‌ చనిపోయినట్లు శనివారం రాత్రి తెలంగాణ పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని శరత్‌ బాబాయ్‌ ప్రసాద్‌ తెలిపారు.

ఉద్యోగం చేస్తున్నచోటే కాల్పులు

శరత్‌ స్వస్థలం వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌. తండ్రి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు. రామ్మోహన్‌ కుటుంబంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ధరంకరం రోడ్డులో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శరత్‌ హైదరాబాద్‌లోనే మూడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఎంఎస్‌ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

బిల్లు అడిగాడనే కాల్చారా?

కాల్పులు జరిపింది ఎవరు? ఎందుకు కాల్చారు అనే విషయం తెలియలేదని శరత్‌ బంధువు సదాశివుడు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు హోటల్‌లోని క్యాష్‌కౌంటర్‌లో శరత్‌ విధుల్లో ఉన్నాడు. గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చి ఆహారం తీసుకున్నాడు. బిల్లు 30 డాలర్లు అయిందని చెప్పగా, వెంటనే తుపాకీ తీసి శరత్‌ను కాల్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో శరత్‌ తీవ్ర గాయాలపాలవడంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.

డీజీపీని ఆశ్రయించిన తల్లిదండ్రులు

కుమారుడిపై కాల్పులు జరిగాయని తెలియడంతో శరత్‌ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కన్సాస్‌ నగర పోలీసులు సరిగా వివరాలు చెప్పకపోవడంతో శనివారం వారు హైదరాబాద్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి తమకు సహకరించాలని కోరారు. డీజీపీ భారత రాయబార అధికారులతోనూ, పాస్‌పోర్టు కార్యాలయ అధికారులతోనూ మాట్లాడారు. శనివారం రాత్రి శరత్‌ మృతిని పాస్‌పోర్టు అధికారులు నిర్ధారించి, తెలంగాణ పోలీసులకు తెలియజేశారు. వారు శరత్‌ బంధువులకు చెప్పారు.