తెలుగు కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అదరగొట్టాడు. ఈ సూపర్ సిరీస్ ప్రీమియర్ ఈవెంట్లో శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో ఏకంగా ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు సన్ వాన్ హోకు షాకిచ్చి ఈ సీజన్లో రెండోసారి సూపర్‌సిరీస్ టైటిల్‌పోరులో శ్రీకాంత్ నిలిచాడు.
ఇక ప్రీక్వార్టర్స్‌లో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీని, క్వార్టర్స్‌లో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ చెన్ లోంగ్ను చిత్తుచేసి సంచలనం సృష్టించిన మరో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఫైనల్ చేరడంలో విఫలమై సెమీస్‌లోనే వెనుదిరిగాడు. ఆద్యంతం నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-15, 18-21, 24-22తో దక్షిణ కొరియా షట్లర్ సన్ వాన్ హోను కంగుతినిపించి ఈ వేదికపై తొలిసారి ఫైనల్ చేరాడు.
సూపర్ సిరీస్ ఈవెంట్లో ఫైనల్ చేరడం శ్రీకాంత్‌కిది నాలుగోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సింగపూర్ ఓపెన్ టైటిల్‌పోరులో సహచరుడు సాయి ప్రణీత్ చేతిలో ఓడిన శ్రీకాంత్.. అంతకుముందు 2014లో చైనా ఓపెన్, 2015లో ఇండియా ఓపెన్‌లో ఫైనల్ చేరాడు. ఆదివారం జరిగే ఫైనల్ఫైట్లో జపాన్‌కు చెందిన ప్రపంచ 47వ ర్యాంకర్ కుజుమసాసకాయితో శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.