దేశవ్యాప్తంగా టెలికం వినియోగదారుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ చివరి నాటికి వినియోగదారుల సంఖ్య 119.80 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ వెల్లడించింది. ఇటీవల టెలికం రంగంలోకి అడుగుపెట్టిన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కస్టమర్లు మాత్రం స్వల్పంగా తగ్గారు. మార్చిలో ఉన్న వినియోగదారులతో పోలిస్తే 0.36 శాతం చొప్పున పెరిగారు.
వీరిలో వైర్లెస్ లేదా మొబైల్ వినియోగదారులు 117.46 కోట్ల మంది ఉన్నారు. గడిచిన ఏడు నెలల్లో ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి. జియో ప్రకటించిన ఉచిత ఆఫర్ ముగిసినప్పటికీ వినియోగదారులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలిచింది.ఏప్రిల్‌లో జియో అదనంగా 38 లక్షల మందిని ఆకట్టుకున్నది.
టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 28 లక్షల మంది చేరగా, బీఎస్ఎన్ఎల్కు 8 లక్షలు, వొడాఫోన్‌కు 7 లక్షలు, ఐడియాకు 6 లక్షల మంది చేరారు. టాటా టెలిసర్వీసెస్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
14 లక్షల మంది వినియోగదారులు టాటాను వదిలి ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారట. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా 13 లక్షల మంది వీడారు. మార్చిలో 0.22 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న ల్యాండ్‌లైన్ వినియోగదారులు ఆ తర్వాతి నెలకుగాను 0.42 శాతం తగ్గారు.
మూడేండ్లలో రెండింతలైన డాటా వినిమయం దేశవ్యాప్తంగా డాటా వినిమయం గడిచిన మూడేండ్లలో 142 శాతం పెరిగిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. గడిచిన మూడేండ్లలో ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు 17 రెట్లు పెరుగగా, డిజిటల్ వ్యాలెట్ సేవలు 200 రెట్లు అధికమయ్యాయి. పెద్ద నోట్లను రద్దుతో గత ఆరు నెలల్లో డిజిటల్ వ్యాలెట్ సేవలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.