సులభ వాణిజ్య విధానంలో అన్ని రాస్త్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉందని, ఇతర రాష్ట్రాలు ఇక్కడి విధానాలను అనుసరించాలని అసోచామ్ జాతీయ అధ్యక్షుడు సందీప్ జజోడియా తెలిపారు. " భారత్లో సులభ వాణిజ్య విధానం- సమస్యలు, సవాళ్లు" అనే అంశంపై అధ్యయన నివేదికను విడుదల చేస్తూ వ్యాపారులకు అనుమతులు త్వరగా రావడం ద్వారా వారి ఉత్పత్తులు త్వరగా మార్కెట్లోకి వచ్చే అవకాశముందంటూ తెలంగాణను వ్యాపార అనుకూల రాష్ట్రంగా అభివర్ణించారు.
పూర్తి ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి పారదర్శకతకు పెద్దపీట వేశారని అంటూ ఆన్లైన్ విధానం ద్వారా అవినీతి కూడా తగ్గుతుందని చెప్పారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించిన అనేక మంది యాజమాన్యాలు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో సులభతర వాణిజ్య విధానాల్లో సంస్కరణలు తీసుకురావడంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషించారని జజోడియా అభినందించారు.
నోట్ల రద్దు ప్రభావం, మొండి బకాయిలు(ఎన్పీఏ) స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) ప్రభావం చూపాయని అంటూ పెద్ద నోట్ల రద్దుతో అనేక రంగాలు కుంటుపడ్డాయని, ఇందులో రియల్టీ రంగం ఒకటని చెప్పారు. ఈ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఐటీ రంగంలోనూ ఉద్యోగాలు తగ్గుతున్నాయన్నారు. గృహ రుణాల జారీ సైతం మందగించిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగం ద్వారానే పెట్టుబడులు పెడితే సరిపోవని... ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులు రావాలని ఆయన స్పష్టం చేశారు.