Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ లో సీఎల్పీ చిచ్చు .... సీఎల్పీ లీడర్ ను ఎన్నుకోండని రాహుల్ కి విజ్ఞప్తి

Category : state politics

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఆసక్తికర వ్యవహారం నడుస్తోంది. అదే సీఎల్పీ లీడర్ ఎంపిక. ఈ నెల 17 నుండి శాసనసభ సమావేశాలు ఆరంభమకానున్న తరుణంలో సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు కసరత్తులు జరిగాయి. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసి వేణుగోపాల్ పరిశీలనలో శాసనసభాపక్ష సమావేశం కానుంది. ఇందులో ఎంపిక ఖాయం కానుంది. ఈ పదవికి ప్రధానముగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్కల పేర్లు వినబడుతున్నాయి.

అధికారంలోకి వచ్చి పదవులు చేజిక్కించుకోవాలనుకున్న చాలా మంది కాంగ్రెస్ నాయకులకు ఎన్నికలు షాకిచ్చాయి. టీఆర్ఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ చతికిలపడింది. పార్టీపరంగా ఎలాంటి పదవులు రానప్పటికీ.. కేబినెట్ హోదాతో సమానమైన సీఎల్పీ నేత పదవికి కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నెలకొంది.పార్టీ తరపున గెలిచిన 19 మంది శాసనసభ్యుల్లో సీఎల్పీ నేత అయ్యే అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై గత కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు ఈ పదవి కోసం పోటీపడుతున్నారు.ఈ క్రమంలో జూనియర్లు సైతం తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సీఎల్పీ పదవి తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీలో చాలా మంది పనికిమాలిన నాయకులు ఉన్నారని.. వారి కంటే తానే సీనియర్‌నంటూ ఆయన వాదిస్తున్నారు.పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పానని తెలిపారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని... అయితే రాహుల్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 ఎంపీ సీట్లు రావాలంటే.. పార్టీలో ప్రక్షాళన జరగాలన్నారు.

ఇక ఈ వివాదంతో సీఎల్పీ లీడర్‌ను ఎన్నుకునే బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అప్పగిస్తూ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఏకవాక్య తీర్మానం చేసింది. ఏఐసీసీ పరిశీలకులు వేణుగోపాల్‌ నేతృత్వంలో సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో రెండో దఫా చర్చలు జరిపిన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సీఎల్పీ లీడర్‌ను ఎన్నుకునే బాధ్యత రాహుల్‌కే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎల్పీ నేత రేసులో ఉన్నట్లు సమాచారం.