ఒంటిపై పచ్చబొట్టు (టాటూ) వేసుకోవడం ఈ మధ్య ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ముఖ్యంగా యువత రకరకాల టాటూలను ఒంటిపై వేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. కొందరు ఎప్పటికీ చెరిగిపోని టాటూలను వేసుకుంటే, మరికొందరు కొన్ని రోజుల పాటు ఉండే వాటికి మొగ్గుచూపుతున్నారు.
తాజాగా ఈ టాటూలకు టెక్నాలజీని జోడించి వాటిని మాట్లాడేలా చేస్తున్నాడు ఓ టాటూ ఆర్టిస్ట్. తన గర్ల్‌ఫ్రెండ్ కోరిక మేరకు లాస్ఏంజిల్స్కు చెందిన నేట్ సిగార్డ్ అనే ఈ టాటూ ఆర్టిస్ట్ ఈ వినూత్న ఆలోచనకు తెరలేపాడు. అతని ఆలోచనల నుంచి పుట్టినవే సౌండ్వేవ్ టాటూస్.
కళను, సాంకేతికతను ఉపయోగించి మన భావావేశాలు, అనుభూతులను, ఇష్టమైన పాటను లేదా కొటేషన్ ను, మనం ప్రేమించే వారి గురించిన స్మృతులను శాశ్వతంగా భద్రపరుచు కోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
స్కిన్ మోషన్ యాప్‌ను ఉపయోగించి టాటూలు మాట్లాడటాన్ని గుర్తించవచ్చు. అవి మాట్లాడతాయి. పాడుతాయి. సామెతలు చెబుతాయి. దీనిని సృష్టించిన ఆ టాటూ ఆర్టిస్ట్ అలాంటిదే ఓ వీడియో తీసి ఫేస్బుక్లో షేర్ చేశాడు.
ఏప్రిల్ 11న ఈ వీడియోని షేర్ చేయగా.. ఇప్పటికే కోటిన్నరకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇలాంటి టాటూ వేయించుకోవాలంటే సౌండ్వేవ్ టాటూస్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.