శ్రీలంక గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కసారి కూడా శ్రీలంక ఏ జట్టు చేతిలోనూ క్లీన్‌స్వీప్ కాలేదు. ఇప్పుడు తొలిసారిగా కోహ్లి సేన ఆ జట్టును వైట్‌వాష్ చేసింది.
మూడు టెస్టుల సిరీస్‌ను కూడా ఇదివరకే కోల్పోయిన లంకకు ఇది వరుసగా రెండో దెబ్బ. ఏకపక్షంగా జరిగిన చివరి వన్డేలోనూ భారత్ చెలరేగింది. కోహ్లి రెండో శతకంతో రాణించగా, భువనేశ్వర్ కెరీర్లో తొలిసారిగా ఐదు వికెట్లతో లంకను బెంబేలెత్తించాడు.
తాజా సిరీస్‌తో కలుపుకొని మొత్తంగా భారత్ ఆరుసార్లు వన్డేల్లో క్లీన్‌స్వీప్ విజయాలను సాధించింది. ఈ ఆరింటిలో మూడు క్లీన్‌స్వీప్ విజయాలు విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత్‌కు దక్కడం గమనార్హం. కోహ్లి నాయకత్వంలో 2013లో జింబాబ్వేను 5-0తో ఓడించిన భారత్.. 2014-15లో శ్రీలంకతో 5-0తో, తాజాగా మరోసారి లంకపై 5-0తో సంపూర్ణ విజయాలను సొంతం చేసుకుంది.
మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో భారత్‌కు రెండుసార్లు సంపూర్ణ సిరీస్ విజయాలు లభించాయి. 2008-09లో ఇంగ్లండ్‌పై 5-0తో, 2010లో ఇంగ్లండ్‌పైనే 5-0 తేడాతో ధోనీ కెప్టెన్‌గా టీమిండియా రెండుసార్లు క్లీన్‌స్వీప్ విజయాలు సాధించింది. ఇక, గౌతం గంభీర్ నాయకత్వంలో 2010-11లో న్యూజిలాండ్‌పై భారత్ ఓసారి క్లీన్‌స్వీప్ విజయాన్ని సాధించింది.
శ్రీలంకలో ఆ దేశంపై ఆల్ త్రి ఫార్మెట్లలోనూ పరాజయాల కన్నా విజయాలు పొందిన జట్టుగా భారత్ నిలించింది. టెస్టుల్లో భారత్ 9 విజయాలు సాధించి, ఏడుసార్లు ఓడిపోయింది. వన్డేల్లో 28సార్లు గెలుపొంది. 27సార్లు ఓడిపోయింది. ఇక, టీ-20ల్లో 2-0 విజయాలతో భారత్ ఆధిక్యంలో ఉంది.
వరుస విజయాల జోరును కొనసాగిస్తూ ఐదో వన్డేలోనూ లంకేయులను చిత్తుచేసింది. తొలుత భువనేశ్వర్ ఐదు వికెట్లతో లంక భరతం పడితే.. తర్వాత కెప్టెన్ కోహ్లీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఏ దశలోనూ మనకు పోటీనివ్వలేని లంక మరో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ విజయంతో లంకను వారి సొంతగడ్డపై వైట్‌వాష్ చేసిన తొలి పర్యాటక జట్టుగా కోహ్లీసేన కొత్త రికార్డును నమోదు చేసుకుంది.
ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులు (18 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి. వన్డే క్రికెట్లో 100 స్టంపింగ్‌లు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోని. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో పాంటింగ్ సరసన కోహ్లి (30 సెంచరీలు). సచిన్ (49) అగ్రస్థానంలో ఉన్నాడు.