//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొలొంబో లోనే సిరీస్ దక్కించుకోవాలనే కసితోభారత్ జట్టు

Category : sports

అత్యుత్తమ ఫామ్‌లోనున్న భారత జట్టు గాలే వేదికగా తొలి టెస్టులో శ్రీలంకపై గర్జన చేసింది. ఆ మ్యాచ్‌ను నాలుగు రోజుల్లోనే ముగించిన కోహ్లీసేన ఇదే జోరులో కొలంబోనూ కొల్లగొట్టి సిరీస్ దక్కించుకోవాలనే కసితో ఉంది. మరోవైపు అనుభవలేమికి తోడు గాయాలతో సతమతమవుతున్న లంక రెండోమ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలన్న ఆరాటంలో ఉన్నది.

భారత్‌- శ్రీలంక క్రికెట్‌ జట్ల మధ్య రెండో టెస్టు గురువారం కొలంబోలో  ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0తో అధిక్యంలో వున్న భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ జోరు చూస్తే, ఈ రెండో మ్యాచ్‌లోనూ ఆతిధ్య జట్టుకు కష్టాలు తప్పవని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో కోహ్లి సేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

తొలి టెస్టులో ఓవర్‌కు 4.5 సగటున 840 పరుగులను భారత్‌ చేసింది. ఇది కూడా 13 వికెట్లను మాత్రమే కోల్పోయి. కాగా, తీవ్ర జ్వరం కారణంగా తొలి టెస్టుకు దూరంగా వున్న ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ రెండో టెస్టులో తుది జట్టులోకి వచ్చాడు. దీంతో గాలే టెస్టులో రాణించినా అభివన్‌ ముకుంద్‌ను తుది జట్టు నుంచి తప్పించక తప్పలేదు. . చటేశ్వర పూజారాతో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు వున్నాయి.

అలాగే చటేశ్వర పుజారాకు ఇది 50వ టెస్టు మ్యాచ్‌. అలాగే అతను నాలుగు వేల టెస్టు పరుగులకు కేవలం 34 పరుగుల దూరంలో వున్నాడు. శ్రీలంకపై పుజారాకు మంచి రికార్డు వుంది. శ్రీలంకపై ఆడిన ప్రతీ రెండు మ్యాచ్‌లకు ఒక్క సెంచరీ చొప్పున పుజారా సాధించాడు. నేటి టెస్టులోనూ పుజారా రాణిస్తాడనే అంచనాలు వున్నాయి.

శ్రీలంక జట్టు గాయాలతో సతమతమవుతున్నది. ఇప్పటికే గుణరత్నే సిరీస్ నుంచి పూర్తిగా నిష్క్రమించగా, వెన్నునొప్పితో పేసర్ సురంగ లక్మల్ కొలంబో టెస్ట్‌కు దూరమయ్యారు. మరోవైపు లంకకు ఆయువుపట్టు అయిన సీనియర్ స్పిన్నర్ హెరాత్ రెండో టెస్ట్‌లో ఆడేది అనుమానంగా మారింది. బౌలింగ్ వేసే చేతికే గాయం కావడంతో హెరాత్ రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడా అన్నది ఆఖరు వరకు తెలిసేలా లేదు. 

మరోవైపు న్యూమోనియా నుంచి కోలుకున్న రెగ్యులర్ కెప్టెన్ చండీమల్ తిరిగి జట్టులోకి రావడం కొంతలో కొంత ఉపశమనం. దీనికి తోడు లాహిర్ తిరిమానేను తిరిగి జట్టుకు ఎంపిక చేశారు. మరి ఇప్పటికైనా..లంక భారత్‌కు కొలంబోలో కనీసం పోటీ ఇస్తుందో లేదో చూడాలి.