మొదటి మ్యాచ్ నుంచి మొదలుపెడితే ఆఖరి మ్యాచ్ వరకు గెలుపును ఆలంభనగా చేసుకున్న భారత్ శ్రీలంకను దిగ్విజయంగా జయించింది. లంక జట్టు అనుభవలేమిని అనుకూలంగా మలుచుకుంటూ వన్డే సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
లంక నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తన సూపర్ ఫామ్‌కు కొనసాగింపుగా కెప్టెన్ కోహ్లీ(116 బంతుల్లో 110 నాటౌట్, 9 ఫోర్లు) అజేయ సెంచరీకి తోడు కేదార్ జాదవ్(73 బంతుల్లో 63, 7 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. మొదట భువనేశ్వర్(5/42) ధాటికి లంక 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.
శ్రీలంక జట్టులో తిరిమానే(67), మాథ్యూస్(55) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఐదు వికెట్లతో అదరగొట్టిన భువీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా, ఐదు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించిం ది. ఇరు జట్ల మధ్య ఏకైక టీ20 ఈనెల 6న కొలంబోలో జరుగుతుంది.
వన్డేల్లో విరాట్ కోహ్లీ పరుగుల పరంపర దిగ్విజయంగా కొనసాగుతూనే ఉన్నది. లంకతో ఐదో వన్డేలో సెంచరీ ద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్(49) తర్వాత వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ(30) నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(30)ను దాటేశాడు. అయితే పాంటింగ్ ఈ ఫీట్‌ను 375 మ్యాచ్‌ల్లో అందుకోగా, ఈ 28 ఏండ్ల డాషింగ్ బ్యాట్స్‌మన్ కేవలం194 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. మరోవైపు తన కెరీర్లో 25శాతం పరుగులు లంక(2186) పైనే నమోదు చేసుకున్నాడు.