ఓ ఆరేళ్ళ విద్యార్ధి ఉగ్రవాది అనే అనుమానం తో పోలీసులకి ఫిర్యాదు చేసిన ఘటన అమెరికా లో చోటు చేసుకుంది.
ఓ ఆరేళ్ల ముస్లిం బాలుడు అమెరికాలోని పాఠశాల గదిలో ‘అల్లా', ‘బూమ్’ అని అరుస్తూ, మిగతావారిని భయాందోళనలకు గురి చేయడంతో, అదే గదిలో పాఠాలు చెబుతున్న టీచర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ విద్యార్థి ఉగ్రవాదని భావించిన మీదటే పోలీసులను పిలిపించినట్టు టీచర్ చెప్పడం గమనార్హం.
ఈ ఘటన టెక్సాస్ లోని పియర్లాండ్ లో జరిగింది. విద్యార్థి పేరు మహ్మద్ సులేమాన్ కాగా, అతను బుద్దమాంధ్యంతో బాధపడుతున్నాడని అతని తండ్రి పోలీసులకు చెప్పాడు. అతను చదివే పాఠశాలకు నిత్యమూ వచ్చే టీచర్ కు తన కుమారుడి విషయం తెలుసునని, ఆమె కాకుండా మరో టీచర్ రావడంతోనే పోలీసులకు ఫిర్యాదు వెళ్లిందని చెప్పాడు. తన కుమారుడికి సరిగ్గా మాటలు కూడా రావని, ఈ ఫిర్యాదు వెను జాతి వివక్ష ఉందని ఆరోపించాడు.
చిన్న బిడ్డపై ఉగ్రవాదిగా ముద్ర వేయడం ఏంటని ప్రశ్నించాడు. కాగా, ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, ఇప్పటివరకూ ఎటువంటి చర్యా తీసుకోలేదని పియర్లాండ్ పోలీసులు వెల్లడించారు.