Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ మేనిఫెస్టో.. వారికి పండగే..

Category : politics state

ఉగాది పర్వదినాన తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఐదేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూనే.. రాబోయే ఐదేళ్లలో ఏం చేయబోతున్నామన్నది వివరించారాయన. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూనే… సంక్షేమాన్ని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో భరోసా ఇచ్చారు చంద్రబాబు. రాజధానితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామన్న చంద్రబాబు.. రైతులకు అండగా నిలుస్తామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు అనుసరించబోయే విధానాలను ప్రకటించారు. ఏటా అన్నదాత సుఖీభవ కొనసాగింపు, వచ్చే ఖరీఫ్ నుంచి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తింపు, గిట్టుబాటు ధర కోసం 5 వేల కోట్లతో స్థీరీకరణ నిధి ఏర్పాటు, పగటి పూట 12 గంటల విద్యుత్ ఇస్తామన్నారు.

వృద్ధాప్య పింఛన్ అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఇక మహిళా సాధికారతకు ప్రధాన్యం ఇస్తామని అన్నారు. డ్వాక్రా మహిళల ఆర్ధిక పరిపుష్టికి పసుపు-కుంకుమను ఐదేళ్ల పాటు కొనసాగిస్తామన్నారు. స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామని, వడ్డీ లేని రుణాలను 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారాయన.

ఎస్సీ, ఎస్టీలు, బీసీలులతో పాటు అగ్రవర్ణాల్లో పేదలపై వరాలు కురిపించారు చంద్రబాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, మాదిగ, రెల్లిలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు, ఆదివాసీలు, బీసీల అభివృద్ధికి ప్రత్యేక బ్యాంక్, బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత, రాజకీయ ప్రాతినిథ్యం లేని వడ్డెర, బ్రాహ్మణ కులాలకు ఎమ్మెల్సీ పదవి, అగ్రవర్ణాల పేదలకు కూడా సంక్షేమ పథకాల వర్తింపచేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి 20 వేల ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. విద్య, ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లతో పాటు కాపు సంక్షేమానికి వచ్చే ఐదేళ్లలో 5 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

అటు నిరుద్యోగులు, విద్యార్ధుల ప్రయోజనాలకు కూడా తమ మేనిఫెస్టోలతో ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీ. నిరుద్యోగ భృతిని 3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇంటర్ విద్యార్ధులకు ల్యాప్ టాప్ లు, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ విదేశీ విద్య కోసం 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బీసీల్లో చేపల వేటకు వెళ్లే వారిలో క్రాప్‌ హాలిడే కింద ఇచ్చే సాయాన్ని 10 వేలకు పెంపు. పాస్టర్లకు, ఇమామ్‌, పూజారులకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇక 20 వేల జనాభా దాటిన మేజర్‌ పంచాయతీలన్నింటిలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌, విశాఖపట్నంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మండలం, పట్టణాల్లో చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు

Related News