దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ ఉత్పత్తుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) 2017 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 4.2 శాతం వృద్ధితో రూ.6,608 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 4.2 శాతం పెరిగి రూ.29,642 కోట్లకు చేరింది. 2016 జనవరి నుంచి మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.6,347 కోట్ల లాభాలు, రూ.28,449 కోట్ల రెవెన్యూ నమోదు చేసుకుంది. 2016-17లో కంపెనీ నికర లాభాలు 8.3 శాతం వృద్ధితో రూ.26,289 కోట్లకు చేరాయని సోమవారం ఆ కంపెనీ ప్రకటించింది. ఇదే సమయంలో ఆదాయాలు 8.6 శాతం పెరిగి రూ.1.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. డాలర్ల రూపంలో క్రితం క్యూ4లో టిసిఎస్ రెవెన్యూ ఏకంగా 8.5 శాతం పెరిగింది. 2016-17లో కంపెనీ డిజిటల్ టెక్నలాజీస్ వ్యాపారం 29 శాతం వృద్ధితో 3 బిలియన్ డాలర్లకు చేరింది. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తమకు కీలకమైన మార్కెట్లు ఆర్థికంగా, రాజకీయంగా చాలా అనిశ్చితిలో ఉన్నప్పటికీ మెరుగైన వృద్ధిని సాధించామని టిసిఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపినాథన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ ఖాతాదారులు సమీకృత ఆఫర్లను కోరుతున్నారని, వారి క్లౌడ్ ఎజెండా ప్రకారం సొల్యూషన్స్ అందిస్తున్నామన్నారు.