ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ మంతనాలు చేస్తున్నది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి కొనుగోలు చేయడం కోసం టాటా గ్రూప్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రభుత్వంతో అనధికారిక చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తున్నది.
ఎయిరిండియాలో 51 శాతం వాటా కొనుగోలుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపుతున్నట్లు ఒక న్యూస్ చానెల్ కధనం వెల్లడించింది. 1953లో ఎయిరిండియాను జాతీయం చేయకముందు ఈ ఎయిర్‌లైన్స్ టాటా గ్రూప్ చేతుల్లోనే ఉండటం గమనార్హం. రూ.52 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటైజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గతంలో చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా కూడా ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. టాటా గ్రూప్ ఇప్పటికే ఎయిర్ ఏషియా, విస్తారా ఎయిర్‌లైన్స్‌లో భాగస్వామిగా ఉంది.
నిజానికి ఎయిరిండియాని 1932లో టాటా ఎయిర్‌లైన్‌గా టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948లో అది ఎయిరిండియా ఇంటర్నేషనల్‌గా మారింది. ఐదేళ్ల తర్వాత దీనిని జాతీయం చేసి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది.వాజపేయి హయాంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి సొంతంగా దేశంలో విమానాలు నడపడం కోసం రతన్ టాటా ప్రయత్నం చేశారు. అయితే అప్పటి పౌరవిమాన మంత్రి ప్రమోద్ మహాజన్ సహకరించక పోవడంతో ఆగ్రహంతో ఆ ప్రయత్నాన్నీ ఆయన విరమించుకోవడం తెలిసిందే.