ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి భారత మార్కెట్లోకి ఎస్యువి నెక్సాన్‌ను అందుబాటులోకి తెస్తామని టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్ తెలిపారు. దీంతో ప్యాసింజర్ వాహన రంగంలో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని నిర్దేశించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశీయ అమ్మకాల్లో 5 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో ఉన్నామని చెప్పారు. 2019 ముగింపు నాటికి మూడో స్థానం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం తాము దేశ వ్యాప్తంగా 60 శాతం మార్కెట్‌కు దూరంగా ఉన్నామన్నారు. దీంతో భవిష్యత్తులు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. మంగళవారం తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి కొత్త టిగోర్‌ను విడుదల చేసింది. మంగళవారం ఈ కారును టాటా మోటార్స్ డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి టిగోర్ దోహదం చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.ప్రధానంగా యువతను ఆకట్టుకునే లక్ష్యంతో సరికొత్త డిజైన్‌తో టిగోర్‌ను తీసుకొచ్చామన్నారు. ప్రస్తుత మారుతున్న వినియోగదారులు అనుగుణంగా ప్యాసింజర్ వాహన ఫోర్ట్‌ఫోలియోలో అత్యంత అందంగా ఈ మోడల్‌ను రూపొందించామన్నారు. మొత్తం ఆరు రంగుల్లో ఈ మోడల్స్ లభిస్తాయన్నారు. రెండు నెలల క్రితమే ఎస్యూవీ హెక్సాను టాటా మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేసిందన్నారు. స్పీల్ట్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ప్రీమియం ఫినీష్‌తో అత్యద్భుతమైన డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, లగ్జరీ స్థాయి సీట్లు, ఎనిమిది స్పీకర్లు కలిగిన ఆడియో వ్యవస్థ, డ్యూయల్ పాత్ ఫ్రంట్, బ్యాక్ సస్పెన్షన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫోన్, మీడియా కంట్రోల్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. దీనికితోడు స్పోర్టీ అలారు వీల్స్, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు పొందుపర్చినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూం వద్ద 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ప్రారంభ ధర రూ.4.85 లక్షలు, 1.5 లీటర్ రెవోటార్క్ డీజిల్ ఇంజిన్ ప్రారంభ ధర రూ. 5.77 లక్షలుగా నిర్ణయించామన్నారు.