2018లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ రెండేళ్లు పాటు వాయిదా పడనున్నట్లు తెలుస్తున్నది. ఈ టోర్నీని 2020లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు ఐసీసీ వర్గాలు తెలిపారు. టోర్నీ ఆడాల్సిన టీమ్స్ అన్నీ వచ్చే ఏడాది ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీగా ఉండటమే అందుకు కారణంగా చెబుతున్నారు.
ఇంకా దీనికి వేదికను ఖరారు చేయాల్సి ఉంది. జట్లన్నీ బిజీగా ఉండటం వల్ల వేదికను కూడా నిర్ణయించ లేదనీ , 2020లోనే దీనిని నిర్వహిస్తామని ఐసీసీలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. సౌత్ఆఫ్రికా లేదా ఆస్ట్రేలియాలో 2020 టీ20 వరల్డ్‌కప్ జరిగే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు.
అంతేకాదు ఐసీసీ టోర్నీలు ఎక్కువ అవుతుండటంతో తమకు మరింత సమయం కావాలని సభ్య దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్స్ గతంలో 2007లో సౌత్ఆఫ్రికా , 2009లో ఇంగ్లండ్, 2010లో వెస్టిండీస్, 2012లో శ్రీలంక, 2014లో బంగ్లాదేశ్, 2016లో ఇండియాలో జరిగిన విషయం తెలిసిందే.
ద్వైపాక్షిక సిరీస్‌లతోనే బ్రాడ్కాస్టర్ల అధిక ఆదాయం వస్తుండటంతో సభ్యదేశాలు వాటికే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా ఇండియా ఎక్కడికైనా వెళ్తే సదరు ఆతిథ్య దేశం బాగా సంపాదిస్తుంది. వచ్చే ఏడాది ఇండియా వరుసగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లకు వెళ్లనుంది. ఇక 2021లో ఇండియా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వనుంది. ఆ టోర్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది.