బ్లాక్ మనీకి స్వర్గధామంగా పేరుగాంచిన స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంకుల్లో భారత కరెన్సీకి చెందిన నకిలీ నోట్లు పట్టుబడుతున్న సంఘటనలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాదిలో స్విస్ అధికారులు జప్తు చేసిన నకిలీ రూపీ నోట్ల విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగింది. దాంతో వారి దేశంలో పెద్ద మొత్తంలో పట్టుబడ్డ నకిలీ విదేశీ కరెన్సీలో భారత కరెన్సీ మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో యూరో డాలర్ ఉన్నాయి.
స్విట్జర్లాండ్ ప్రభుత్వ అధికారులు సీజ్ చేసిన నకిలీ కరెన్సీలో అన్నీ రూ.500 రూ.1000 నోట్లే. ఈ రెండు రకాల నోట్లను భారత ప్రభుత్వం గత ఏడాది నవంబర్లోనే నిషేధించింది. వాటి స్థానంలో కొత్త రూ.500 రూ.2000 నోట్లను చెలామణిలోకి తెచ్చింది. స్విస్ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ పోలీస్ (ఫెడ్పోల్) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత సంవత్సరంలో 1437 నకిలీ రూ.1000 నోట్లు పట్టుబడ్డాయని వెల్లడించింది.