కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కాగా, సీబీఐ అరెస్టు నుంచి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా అరెస్టు విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చలేమని, సీబీఐ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమంటూ సుప్రీం కోర్టు తెలిపింది.
ఈ రోజు చిదంబరం బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. చిదంబరానికి బెయిల్ మంజూరు చేయాలంటూ కపిల్ సిబాల్, మను సింఘ్వీ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇద్దరు న్యాయవాదుల వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్ను తిరస్కరించారు. మరోపక్క చిదంబరాన్ని విచారించేందుకు మరికొంత సమయం కావాలంటూ సీబీఐ సుప్రీంను కోరింది. అలాగే చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ కూడా మరో పిటిషన్ వేసింది. ఈ రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించాల్సి ఉంది.
అయితే నేటితో చిదంబరం సీబీఐ కస్టడీ ముగియనుండటంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఆ మేరకు తీహార్ జైల్లో ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. చిదంబరానికి జైలు నెం.7ను కేటాయించారని, ఆ జైలులో ఆర్థిక నేరగాళ్లు మాత్రమే ఉంటారని సమాచారం. చిదంబరానికి ఆహారంగా మిగతా ఖైదీల మాదిరిగానే పప్పు, నాలుగు చపాతీలను చిన్న బౌల్లో ఇవ్వనున్నారు. సౌత్ ఇండియన్ ఫుట్ కావాలంటే అందుకు తగ్గ ఏర్పాట్లను జైలు అధికారులు చేయనున్నారు. అది కూడా కోర్టు అనుమతి మేరకే ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.