టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ను పంజాబ్ బౌలర్ అంకిత్ వణికించాడు. విలియమ్సన్ (0), ధవన్ (11), సాహా (6)లను వెనక్కి పంపడంతో రైజర్స్ 27/3 స్కోరుతో కష్టాల్లో పడింది. మనీష్ పాండే ఇచ్చిన మూడు క్యాచ్‌లు సహా నాలుగు క్యాచ్‌లను పంజాబ్ ఫీల్డర్లు జారవిడవకుంటే హైదరాబాద్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ దశలో మనీష్ పాండే, షకీబల్ జట్టును ఆదుకున్నారు. పాండే 4, 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌లను అశ్విన్, టై చేజార్చారు.
అదే విధంగా ఆరో ఓవర్లో షకీబల్‌ను ఖాతా తెరవకముందే బరీందర్ అవుట్ చేశాడు. కానీ అది నోబాల్. తర్వాత పర్యాటక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 7 నుంచి 12 ఓవర్ల మధ్య ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. 14వ ఓవర్లో షకీబల్‌ను ముజీబ్ అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అశ్విన్ వేసిన 15వ ఓవర్లో మనీష్ ఫోర్, సిక్సర్‌తో రైజర్స్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఇక ఆఖరి ఓవర్లో పాండే, నబీ (4)ని అవుట్ చేసిన రాజ్‌పుత్ ఐదు వికెట్లను ఖాతాలో వేసుకొన్నాడు.
అనంతరం.. ఆతిథ్య బౌలర్ల దెబ్బకు పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు రాహుల్ (32), క్రిస్ గేల్ (22 బంతుల్లో 23) తప్ప మిగతా బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. రషీద్ ఖాన్ (3/19) మూడు వికెట్లతో చెలరేగగా.. సందీప్ శర్మ, బాసిల్ థంపి, షకీబల్ హసన్ రెండేసి వికెట్లు తీశారు.