సిరియా రాజధాని డమాస్కస్ ఆదివారం బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. మూడు కారు బాంబు పేలుళ్లు జరిగి దాదాపు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు కారు బాంబు పేలుళ్లు ఒకేసారి జరగగా.. మరో ప్రాంతంలో మూడో కారు బాంబు పేలుడు జరిగింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, దగ్గర్లో ఉన్న వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న భవంతి కుప్పకూలిపోవడంతో అందులో ఉన్న మహిళ, ఓ చిన్నారి తీవ్ర గాయలపాలయ్యారు. చనిపోయిన వారిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు.
మొదట తుపాకీల శబ్దం అని అనుకున్నా.. కానీ బయటకి వచ్చి చూసేసరికి పేలుడు జరిగిందని తెలిసింది. పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమై కనిపించాయని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. మార్చి నెలలో కోర్టుహౌస్, రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.