Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Category : business

దేశీయ మార్కెట్లు సోమవారం అనూహ్య రీతిలో పాతాళానికి పడిపోయాయి . జీడీపీ గణాంకాల సానుకూలతలతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. ఆ జోరును కొనసాగించలేకపోయాయి. చివరి గంటల్లో వెల్లువెత్తిన అమ్మకాల సెగ మార్కెట్‌ను అమాంతం పడగొట్టింది. ఫలితంగా సూచీలు భారీ నష్టాల చవి చూశాయి.

ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో జీడీపీ రెండేళ్ల గరిష్ఠానికి చేరిందన్న వార్తలతో ఈ ఉదయం సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 140 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టగా.. నిఫ్టీ 11,700 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ లాభాలు ఎంతోసేపు నిలువలేదు. బ్యాంకింగ్‌, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి.

మధ్యాహ్నం తర్వాత ఏ దశలోనూ కోలుకోలేని సూచీలు చివరకు భారీగా పతనమయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 332 పాయింట్లు దిగజారి 38,312 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 11,582 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.5గా కొనసాగుతోంది.