గనులు, తయారీ రంగాల పనితీరు నిరుత్సాహకరంగా ఉండటంతో మే నెలలో పారిశ్రామిక వృద్ధిరేటు (ఐఐపీ) 1.7 శాతానికి పడిపోయింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 8 శాతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ప్రకటించనున్న పరపతి సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపుపై ఆర్బీఐపై ఒత్తిడి మరింత తీవ్రతరమైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో(ఏప్రిల్-మే) పారిశ్రామిక ప్రగతి 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే సమయంలో వృద్ధి 7.3 శాతంగా ఉందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పెట్టుబడులు భారీగా పడిపోవడంతో క్యాపిటల్ గూడ్స్ వృద్ధి 3.9 శాతానికి పరిమితమైంది. మే 2016లో ఇది 13.9 శాతంగా నమోదైంది.
అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ కూడా నిరాశాజనక పనితీరును నమోదు చేసుకున్నది. గతేడాది 5.7 శాతంగా నమోదైన మైనింగ్ రంగ పనితీరు మే నెలకుగాను 0.9 శాతానికి జారుకుంది. తయారీ రంగం విషయానికి వస్తే కేవలం 1.2 శాతం వృద్ధిని కనబరిచింది. అంతక్రితం ఏడాది 8.6 శాతంగా ఉంది. విద్యుత్ రంగం 8.7 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గడిచిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల్లో కూరగాయలు, పప్పు దినుసులు, పాల ఉత్పత్తుల ధరలు దిగువ ముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకోవడానికి దోహదపడ్డాయి.