స్టార్ షట్లర్ పీవీ సింధును డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సచివాలయంలో పీవీ సింధుకు ప్రభుత్వ ఉత్తర్వు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ సీఎం నుంచి డిప్యూటీ కలెక్టర్గా నియామక పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తన తొలి ప్రాధాన్యత బ్యాడ్మింటన్కేనని సింధు చెప్పారు. తాను క్రీడలపై ఎక్కువ దృష్టి సారించనున్నట్లు చెప్పారు. తాను క్రీడల్లో రాణించి భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని చంద్రబాబు నాయుడు సూచించారని సింధు పేర్కొన్నారు. సింధు మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షను వ్యక్తం చేశారు. గ్రూప్ వన్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ లో క్రీడాభివృద్ధికి సేవలందించాలని ఆమెను కోరారు.
రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించి తెలుగు కీర్తి ప్రపంచానికి చాటి చెప్పిన పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం గతంలో గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటిచడంతోపాటు, అమరావతిలో పీవీ సింధుకు వెయ్యి గజాల స్థలం, రూ.3 కోట్ల నగదును కేటాయిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు స్టార్ షట్లర్ పీవీ సింధుకు 1000 చదరపు గజాల స్థలం కేటాయింపు పత్రాలను ప్రగతి భవన్లో అందజేసిన విషయం తెలిసిందే.