//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రెండేళ్లలో స్విస్ ఖాతాల గుట్టు రట్టుకు రంగం సిద్ధం

Category : business


విదేశీ బ్యాంకుల్లో ప్రత్యేకించి స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం సమాచారాన్ని వెలికితీసే దిశగా నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. అంతా అనుకున్న ప్రకారం జరిగితే 2019 నాటికి స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయుల జాబితా కేంద్రానికి అందుతుందని భావిస్తున్నారు. 

భారత్, యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు సహా 41 దేశాలకు నల్లకుబేరుల సమాచారం అందజేసేందుకు స్విట్జర్లాండ్ సుముఖత వ్యక్తంచేసింది. అయితే ఈ సమాచారానికి భద్రత కల్పించడంతోపాటు రహస్యంగా ఉంచాలన్న నిబంధనకు సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని కోరింది. 

ఈ మేరకు  స్విస్‌ ఫెడరల్‌ కౌన్సిల్‌ 'ఆటోమేటిక్‌ ఎక్ఛేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎఇఒఐ)'పై ఆమోదముద్ర వేసింది. 2018లో ఇది అమల్లోకి వస్తుందని, 2019లో తొలి విడతగా కొంత సమాచారాన్ని అందిస్తామని కౌన్సిల్‌ ప్రకటించింది. సమాచార బదిలీ ప్రారంభమయ్యే కచ్చితమైన తేదీని అతి త్వరలోనే భారత ప్రభుత్వానికి స్విస్‌ ప్రభుత్వం అధికారికంగా తెలియజేయనుంది.

స్విస్‌ బ్యాంకుల్లోని ఖాతాల్లో కొంతమంది భారతీయులు పెద్ద మొత్తంలో నల్లధనాన్ని దాచారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఖాతాల సమాచారం కోసం జి20, ఆర్థిక సహకారం-అభివృద్ధి సంస్థ(ఒఇసిడి) వంటి పలు అంతర్జాతీయ వేదికలపై భారత్‌, స్విట్జర్లాండ్‌ మధ్య గతంలో చర్చలు జరిగాయి. 

ఈ నేపథ్యంలోనే ఎఇఒఐ రూపొందించామనీ, అందరి అభిప్రాయాలను తీసుకునే దీన్ని ఆమోదించామని మండలి సభ్యులు వివరించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందానికి సంబంధించి డిక్రీ జారీ అయిన తరువాతనే ఆయా దేశాలల్లో అది అమల్లోకి రానుందని పేర్కొన్నారు.