//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేటి అర్ధరాత్రి నుండి జీఎస్టీ అమలుకు రంగం సిద్ధం !

Category : business

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్‌హాల్ నుంచి జీఎస్టీని కేంద్రం లాంఛనంగా ప్రారంభించనుంది. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు వివిధ కారణాలతో  గైరాజరవుతున్నాయి.శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 75 నిమిషాల పాటు నిర్వహించనున్న జీఎస్టీ ప్రారంభ కార్యక్రమంపై ఇప్పటికే రిహార్సల్స్ కూడా జరిపారు. 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, దేవెగౌడ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు వేదికపై ఆసీనులయ్యే విధంగా షెడ్యూలు తయారు చేశారు. కాంగ్రెస్ కార్యక్రమాన్ని బహిష్కరించినందువల్ల మన్మోహన్‌సింగ్ హాజరుకావడంలేదు. అయితే గైర్హాజరుపై పార్టీలు పునరాలోచించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ విజ్ఞప్తి చేశారు. విపక్షాల నిర్ణయంపై ఆవేదన వ్యక్తంచేసిన ఆర్థిక మంత్రి అందరినీ సంప్రదించాకే కేంద్రం ముందుకు వెళ్లిందని వ్యాఖ్యానించారు. 

పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో అర్ధరాత్రి జరిగే జీఎస్టీ లాంఛన ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది.  దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని, కానీ ప్రతిష్ఠ కోసం మాత్రం జీఎస్టీ ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌ను వాడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. 

జీఎస్టీ కార్యక్రమాన్ని బహిష్కరించకపోయినా గైర్హాజరు కావాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి నిర్ణయించుకున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అర్జేడీ నేత లాలూప్రసాద్ సైతం బహిష్కరించాలని నిర్ణయించారు. అయితే బీహార్ ప్రభుత్వం తరఫున విద్యుత్ మంత్రి బిజేంద్రప్రసాద్ యాదవ్ హాజరు కానున్నారు.

ఇప్పటివరకు దాదాపుగా దేశంలోని అన్నిరాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జీఎస్టీని ఆమోదించాయి. సకాలంలో ఆమోదించకపోతే పరిహారానికి దూరమవుతారని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించడంతో పశ్చిమబెంగాల్, కర్ణాటక హడావిడిగా ఆర్డినెన్స్ ద్వారా ఆమోదం తెలిపాయి. ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా జమ్ముకశ్మీర్ మాత్రమే జీఎస్టీకి మినహాయింపుగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం లేని కేంద్ర చట్టమేదీ కశ్మీర్‌లో అమలు కావడానికి వీల్లేదన్న నిబంధనే అందుకు కారణం.