//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జులై 1 నుంచి జీఎస్‌టీ అమలుకు రంగం సిద్ధం.. బంగారంపై 3 శాతం పన్ను

Category : national business

జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని అమలులోకి తెచ్చేందుకు రంగం సిద్దమైనది. ఈ విషయమై శనివారం దిల్లీలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్‌టీ మండలి సమావేశంలో పెండింగ్ లో  ఉన్న పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాలు జులై 1 నుండి అమలుకు ఆమోదం తెలిపాయి. 

చాలారోజులుగా అపరిష్కృతంగా ఉన్న బంగారంపై  3శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. ఆభరణాలు, జెమ్స్‌ మొదలైనవాటిపై పన్నును 3 శాతంగానూ, మెరుగుపెట్టని  డైమండ్లకు పన్నును 0.25 శాతంగానూ నిర్ణయించారు. రెడీమేడ్‌ దుస్తులపై 12శాతం, నూలు, మిల్లు వస్త్రాలపై 5శాతం, రూ.500లోపు ఉన్న పాదరక్షలపై 5శాతం, రూ.500 దాటిన పాదరక్షలపై 18శాతం చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు. 

గత నెలలో జరిగిన సమావేశంలో 1200కు పైగా వస్తువులు, 500 వరకూ సేవలకు నాలుగు శ్లాబుల్లో 5, 12, 18, 28 శాతం చొప్పున రేట్లు నిర్ణయించిన కౌన్సిల్‌ ఈ రోజు పసిడి, బిస్కెట్లు, దుస్తులు, పాదరక్షలు తదితర అంశాలకు సంబంధించి రేట్లను ఖరారు చేసింది. సిల్కు, జ‌న‌ప‌నార ఉత్ప‌త్తుల‌పై పూర్తిగా ప‌న్నును మిన‌హాయించారు. బిస్కెట్ల‌పై 18 శాతం, బీడిల‌పై 28 శాతం ప‌న్నును విధించారు. 

ప్రస్తుత రీతిలో జీఎస్‌టీ అమలుకు తమ ప్రభుత్వం ఒప్పుకోదని, ఈ విషయమై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కి లేఖ వ్రాస్తున్నట్లు శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ప్రకటించినా నేటి సమావేశంలో ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి అమిత్ మిత్ర ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే పారిశ్రామిక వర్గాలు కొన్ని రకాల వస్తువులపై పన్నులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నా ప్రస్తుతం వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు.