-రేడియో స్టేషన్లో ఆగంతకుని దాడి -పరిస్థితి ఆందోళనకరం రష్యాలో ప్రభుత్వ వ్యతిరేక రేడియో స్టేషన్ ఎకో ఆఫ్ మాస్కోలో పనిచేసే మహిళా జర్నలిస్టు తాత్యానా ఫెల్గెన్గాయర్పై సోమవారం గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. మాస్కో మధ్యప్రాంతంలోని ఎకో రేడియో స్టేషన్ ప్రవేశద్వారం వద్ద ఉండే సెక్యూరిటీ గార్డుపై అతడు స్ప్రేను చల్లి కండ్లు బైర్లు కమ్మేలా చేశాడని చీఫ్ ఎడిటర్ అలెక్సీ వెనెడిక్టోవ్ చెప్పారు.అనంతరం లోపలకు ప్రవేశించి తాత్యానాపై కత్తితో దాడి చేశాడని ఆయన వివరించారు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని వెనెడిక్టోవ్ అన్నారు. తాత్యానాకు వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స జరిపారు. ఆగంతకునికి ఆమె సుపరిచితురాలేనని భావిస్తున్నట్టు చెప్పారు.దాడి అనంతరం మరో సెక్యూరిటీ గార్డు అతడిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఆగంతకుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు వ్యక్తిగత కక్షలే ఈ దాడికి కారణమని అంటున్నారు.