భారత్ కు చమటలు పట్టించి శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయ పల్లెకెలలో పెను సంచలనమే సృష్టించాడు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి ఒంటి చేత్తో భారత్‌ను ఓటమి అంచుకు తీసుకెళ్లాడు. నిజానికి భారత్ ఓడిపోయినట్లేనని అనుకున్నారంతా. ఎందుకంటే 231 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 131కే ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ ‘మిస్టర్ ప్రశాంత’ ధోని, భువనేశ్వర్ జోడీ అద్వితీయ పోరాటపటిమను ప్రదర్శించింది. అభేద్య శతక భాగస్వామ్యంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించింది.
ఏమాత్రం పోటీ ఇవ్వట్లేదని భావించిన శ్రీలంక టీమ్ ఇండియాకు షాక్ ఇచ్చింది. రసవత్తరంగా సాగిన రెండో వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. బుమ్రా (4/43) విజృంభించడంతో భారత్ మొదట శ్రీలంకను 236/8కి పరిమితం చేసింది. ధోని (45 నాటౌట్; 68 బంతుల్లో 1×4), భువనేశ్వర్ (53 నాటౌట్; 80 బంతుల్లో 4×4, 1×6)ల అద్వితీయ పోరాటంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ధనంజయ కళ్లు చెదిరే బౌలింగ్‌తో దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఒక్క ఓవర్‌తో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. అతడు 18వ ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి భారత్ నడ్డివిరిచాడు. కళ్లు చెదిరే గూగ్లీలతో జాదవ్, కోహ్లి, రాహుల్‌లను వెనక్కి పంపాడు. ముగ్గురూ బౌల్డే. బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లి కన్నా ముందొచ్చిన జాదవ్, రాహుల్‌లు కనీసం ఖాతా అయినా తెరవలేదు. తొలి బంతికి జాదవ్, మూడో బంతికి కోహ్లి, ఐదో బంతికి రాహుల్ వెనుదిరిగారు. ధనంజయ అంతటితో ఆగలేదు. తర్వాతి ఓవర్లో మరో గూగ్లీతో పాండ్యను బోల్తా కొట్టించాడు. ముందు కొచ్చి ఆడబోయిన పాండ్య గురి తప్పి స్టంపౌటయ్యాడు. తన మాయను మరో ఓవర్‌కు కొనసాగించిన ధనంజయ్ అక్షర్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ 131/7తో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది.
అఖిల ధనంజయ (6/54) సంచలన బౌలింగ్‌లో ఓ దశలో 131కే ఏడు వికెట్లు చేజార్చుకున్న భారత్‌ను ధోని, భువి జంట అభేద్య శతక భాగస్వామ్యంతో ఆదుకుంది. రోహిత్ (54; 45 బంతుల్లో 5×4, 3×6), ధావన్ (49) రాణించారు. వర్షం వల్ల భారత్ లక్ష్యాన్ని 47 ఓవర్లలో 231 పరుగులకు సవరించారు.
ధనంజయ దెబ్బకు 131/7 టీమ్ఇండియాకు ఏమాత్రం ఆశలు లేని స్థితి. మిగిలిన స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ధోని మాత్రమే. అతడికి తోడు భువనేశ్వర్. వికెట్లు పడ్డ వేగం చూస్తే మ్యాచ్ ఇంకెంతో సేపు సాగదనిపించింది. కానీ ఎన్నో ఒత్తిడి మ్యాచ్‌ల్లో భారత్‌కు అపురూప విజయాలను అందించిన మిస్టర్ కూల్ ధోని ఒకప్పటిలా తన పాత్రలో, తనదైన శైలిలో ఒదిగిపోయాడు.
అటు తన బ్యాటింగ్ నైపుణ్యానికి పరీక్ష పెట్టుకుంటూ భువి మొండిగా పాతుకుపోయాడు. ముందు ధనంజయ ముప్పును సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ ఒక్కో పరుగు తీస్తూ సాగిపోయింది. బంతులు చాలానే ఉండడంతో భారీ షాట్లు ఆడేందుకు తొందర పడలేదు. 30వ ఓవర్లో స్కోరు 160 దాటగా, అప్పటికీ వీళ్లిద్దరు ఒక్క ఫోర్ కూడా కొట్టలేదంటే ఎంత జాగ్రత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ధోనీనే సింగిల్స్ తీయగా, భువనేశ్వర్ నిలబడడానికి ప్రయత్నించాడు. 37 ఓవర్లు పూర్తయినా ఇద్దరి భాగస్వామ్యంలో ఒక్క బౌండరీ కూడా లేదు.