//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తిరుగులేని ఆటతీరుతో భారత్ కు షాక్ ఇచ్చిన శ్రీ లంక

Category : sports

రికార్డు లక్ష్య ఛేదనలో తిరుగులేని ఆటతీరును చూపెట్టిన శ్రీలంక చాంపియన్స్ ట్రోఫీలో కీలక విజయాన్ని అందుకుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. దీంతో భారత్‌ సెమీస్‌కు చేరాలంటే ఈ నెల 11న దక్షిణాఫ్రికాతోజరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాల్సి ఉంటుంది.

టాస్‌ గెలిచిన శ్రీ లంక ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 321/6 పరుగులు చేసింది.322 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీ లంక అలవోకగా 48.4 ఓవర్లలో 322 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ధవన్, రోహిత్ మరోసారి శుభారంభాన్నిచ్చారు. కుదురుకోవడానికి సమయం తీసుకోవడంతో తొలి 5 ఓవర్లలో 17 పరుగులే చేసినా ఆ తర్వాత ధవన్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. లక్మల్ ఆరో ఓవర్‌లో కవర్స్‌లో రెండు ఫోర్లు కొట్టి వేగం పెంచాడు. 10వ ఓవర్ ముగిసేసరికి లంక బౌలర్ల పట్టు సడలడంతో రోహిత్-ధవన్ అలవోకగా పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో జట్టు స్కోరు 100కు చేరింది.

తర్వాత పెరీరా బౌలింగ్‌లో స్కేర్ లెగ్ ఫోర్‌తో హాఫ్ మార్క్‌ను అందుకున్న రోహిత్ ఫుల్‌లెంగ్త్‌ను సిక్సర్‌గా మలిచాడు. అయితే మలింగ వేసిన 25వ ఓవర్‌లో రెండు ఫుల్ లెంగ్త్‌లను సిక్సర్లుగా మలిచిన రోహిత్ మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేసే క్రమంలో వికెట్ సమర్పించుకున్నాడు. 

దీంతో తొలి వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ తర్వాతి బంతికే కెప్టెన్ కోహ్లీ (0) డకౌట్‌గా వెనుదిరగడంతో ఇన్నింగ్స్ కాస్త కుదుపునకు లోనైంది. ధవన్ తన మార్క్ షాట్లతో అలరించినా.. యువరాజ్ (7) పరుగులు చేయడానికి ఇబ్బందిపడి 34వ ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 40 పరుగులు జత చేశారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. ధవన్‌కు మంచి సమన్వయాన్ని అందించాడు. దీంతో లెఫ్టాండర్ 112 బంతుల్లో కెరీర్‌లో 10వ శతకాన్ని సాధించాడు. స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ ద్వయం నాలుగో వికెట్‌కు 64 బంతుల్లో 82 పరుగులు జోడించారు. 

లంకపై శతకంతో ధవన్ కొత్త రికార్డును సృష్టించాడు. చాంపియన్స్ ట్రోఫీలో మూడు సెంచరీలు చేసిన గంగూలీ, గిబ్స్, గేల్ సరసన చోటు సంపాదించాడు. దీంతో పాటు ఈ టోర్నీలో అత్యంత వేగంగా 500 పరుగులు (7 ఇన్నింగ్స్) సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. దాదా 8 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. మరోవైపు చాంపియన్స్ ట్రోఫీలో నాలుగుసార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి జంట ధవన్-రోహిత్.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక ఐదోఓవర్‌లోనే డిక్‌వెల్లా (7) వికెట్‌ను కోల్పోయింది. అయితే రెండో ఓపెనర్ గుణతిలక, వన్‌డౌన్‌లో మెండిస్.. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను పునర్‌నిర్మించారు. వీలైనంత నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీలు సాధించారు. ఈ ఇద్దర్ని ఔట్ చేసేందుకు కోహ్లీ బౌలింగ్‌లో మార్పులు చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దాదాపు 23.1 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉన్న ఈ జోడీ రెండో వికెట్‌కు 159 పరుగులు జత చేసి జట్టును గాడిలో పడేశారు. అయితే ఐదు ఓవర్ల తేడాలో ఈ ఇద్దరూ అనూహ్యంగా రనౌట్‌కావడంతో టీమ్‌ఇండియా ఊపిరి పీల్చుకుంది. 

కుశాల్ పెరీరా (47), మాథ్యూస్ వేగంగా ఆడుతూ 34వ ఓవర్‌లో లంక స్కోరును 200 పరుగులకు చేర్చారు. ఈ ద్వయాన్ని విడదీసేందుకు పార్ట్‌టైమర్లతో పాటు కోహ్లీ నేరుగా బంతితో రంగంలోకి దిగాడు. అయినా వికెట్ తీయలేకపోయారు. పిచ్ మరీ ఫ్లాట్‌గా ఉండటంతో మాథ్యూస్, పెరీరా భారీ షాట్లు కొడుతూ భారత ఫీల్డర్లను చేష్టలుడిగేలా చేశారు. 43వ ఓవర్‌లో పెరీరా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగినా.. గుణరత్నే (34 నాటౌట్), మాథ్యూస్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.