కేరళకు చెందిన ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. అతడిపై ఎత్తివేసిన జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరించింది. అంతకుముందు బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనిపై బీసీసీఐ అప్పీల్ చేయడంతో ఆ తీర్పును కొట్టివేస్తూ.. బీసీసీఐ నిషేధాన్నిహైకోర్టు ధర్మాసనం సమర్థించింది.గత రెండు రోజులుగా ఈ కేసుకు సంబంధించిన వాదనలు వింటున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నవీన్ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం.. మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. మరోసారి ఈ అంశంపై జుడీషియల్ రివ్యూ చేయబోమని స్పష్టంచేసింది. దీంతో రంజీ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్న శ్రీశాంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీసీసీఐ గానీ, ఇతర రాష్ట్రాల క్రికెట్ సంఘాలు నిర్వహించే ఏ మ్యాచ్‌లోనూ శ్రీశాంత్ పాల్గొనే వీలులేకుండా పోయింది.ప్రస్తుతం శ్రీశాంత్కున్న ఏకైక మార్గం సుప్రీం కోర్టును ఆశ్రయించడమే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని శ్రీశాంత్ భావిస్తున్నారని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ఐపీఎల్-6 సీజన్లో స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌తో పాటు, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.