//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన ?

Category : editorial

సినీ ఇండస్ట్రీ…ఒక రంగుల ప్రపంచం...అందరికీ సినిమా వాళ్ళంటే ఇష్టమే...వారి సంపాదన చూసో...వారి స్టార్ డం చూసో వారంటే ఇష్టపడతారు. కానీ ఎందుకో తెలియదు ఈ ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి చులకన భావమే…తొక్కలే మనం సినిమా చూస్తే డబ్బు వెనకేసుకునే సినిమా వాడు చెప్పేది కూడా వినాలా…ఈ సినిమా వాళ్ళు ఇంతే…మన డబ్బుతో స్టార్స్ అయిన వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయట్లేదు అని ఇలా కొన్ని డైలాగ్ లు సోషల్ మీడియా లో మనకి ఎదురవడం కొత్తేమి కాదు.

అసలు ఒక సర్వే ప్రకారం చూస్తే భారత్ లో నూటికి తొంబై శాతం మందికి సినిమాలే కాలక్షేపం…అంటే సినిమాలు చూడడం మాత్రమే కాదు, సినిమా కబుర్లు చెప్పుకోవడం, కుదిరితే అభిమాన హీరో పేరు చెప్పి కొట్టుకోవడం ఇవన్నీ లేకపోతే కాలు చేయి ఆడని వారు ఉన్నారు అనడం అతిశయోక్తికాదు.

సినిమా వాళ్ళు రాజకీయ పార్టీల ప్రచారానికి కావాలి, వ్యాపార సంస్థల ఓపెనింగ్ లకి, ప్రొమోషన్ లకి కావాలి కానీ సినిమా వాళ్ళంటే చులకన. ఇళ్ళల్లో పెళ్లి కి ఎంత మంది సినిమా వాళ్ళు వస్తే అంత ప్రతిష్ట…సినిమా వాళ్ళతో పరిచయాలు కావాలి…వాళ్ళతో ఫోటోలు దిగి గొప్పగా చూపించుకోవాలి ….కానీ సినిమా వాళ్ళంటే మళ్ళి అదే చులకన …

పొద్దున్న లేచి పేపర్ ఓపెన్ చేస్తే చాలు ఆ హీరొయిన్ కి ఈ హీరో కి మధ్య ఏముంది ? ఆ హీరో ఫాం హౌస్ లోనే ఎందుకు ఉంటున్నాడు, అందరి ముందు ఆమె అలా చేసిందా ఇలా చేసిందా ఇలా టైటిల్స్ పెట్టి తమతమ ఊహా చాతుర్యానికి పదును పెట్టి కధలు అల్లుతారు…ఇది ఒకప్పటి పరిస్థితి కాని ఇప్పుడు అయితే ఏకంగా సినీతారల వ్యక్తిగత జీవితాలు వీళ్ళకి బ్రేకింగ్ న్యూస్ లా మారింది. కొన్ని చానెళ్ళు అయితే మరీ దిగజారి జర్నలిజం విలువలు మంటగలిపేలా ప్రవర్తిస్తున్నారు.

ఫేక్ న్యూస్ సృష్టించేది వారే మళ్ళి అది ఫేక్ అని బయట పెట్టేదీ వారే. ప్రస్తుతం యుట్యూబ్ ట్రెండ్ నడుస్తోంది, ఇంట్లో బామ్మా యోగ నేర్చుకోవాలన్నా, సదరు గృహిణి ఏదైనా కొత్త వంటకం నేర్చుకోవాలన్నా, కాలక్షేపానికి కూడా ఏకైక మార్గం ఈ యూట్యూబ్, అందులో ఇప్పుడు మరీ దారుణం పైన హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, లోపల కంటెంట్ ఇంకోకటి ఉంటుంది.

వారే కాక లైక్ ల కోసం, కామెంట్ ల కోసం, రేటింగ్ ల కోసం కొన్ని వెబ్ సైట్స్ సైతం వాళ్ళ ఇష్టానుసారానికి రాసేస్తున్నారు. అశ్లీలమైన వార్తలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీటి వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితాలను భంగం కలుగుతుందని, అది తెలిసి సదరు తార ఇంట్లో వాళ్ళు కుంగిపోతారని ఆలోచించే తీరిక అస్సలు ఉండదు. ఎందుకంటే వచ్చే ఆన్సర్ ఒకటే వాళ్లకి ఇవన్నీ కామన్ అబ్బా...నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావ్ అని.

ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి…సినిమా వాడు కూడా మనిషే…వాడికి భావోద్వేగాలు…బలహీనత లు ఉంటాయి…వ్యక్తిగత అంశాల పై తప్పుడు రాతలు, వాస్తవం లేని పుకార్లు సినీతారల గౌరవ, ప్రతిష్టలు దెబ్బతీస్తాయని దానివల్ల మనోవేదనకు గురౌతారని కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండదు అలా వ్రాసే వారికి. ఒకరకంగా సినిమావాళ్ళ జీవీతాలతో ఆడుకుంటున్న వీరికి గడ్డి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటె బాగుండేది ఏమో ?

ఇప్పటికీ దీనికి ఒక సరయిన నియంత్రణ లేకుంటే యువత పెడదారిన పట్టి నాశనమయ్యే పరిస్థితిని ఎదురుకోవాల్సి వస్తుంది. ఇన్ని జరుగుతున్నా, నీచపు వార్తలు వ్రాస్తున్నా, ఆ పేరు పెట్టి యూట్యూబ్ వీడియోలు వదులుతున్నా ఒక్కరయినా నిలదీశారా ? లేదే.

అభిమానులం అంటూ రక్తదానాలు , హీరో కటౌట్ కు పూలమాలలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్న అభిమాన గణం తమ అభిమాన హీరోకి ఎవరో హీరొయిన్ తో ఎఫైర్ పెట్టి వార్తలు రాస్తుంటే ఎందుకు ఖండించరు.

మనకిష్టమైన ఒక హీరో ని కించపరిచేల మాట్లాడాడని అనిపిస్తే చాలు పేస్ బుక్ లో లైవ్ లు, వీడియోలు తిడుతూ కామెంట్ చేసే మనం అదే ఒక స్త్రీని యూట్యూబ్ ఛానెల్స్ లో , వెబ్ సైట్స్ లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు , వీడియోల ను అశ్లీల పరుస్తూ అనే మాటల పైన ఏ మాత్రం స్పందించని సదరు అభిమాన గణం సొసైటీ లో ఎక్కడ ఉన్నామో , ఏ స్టాయిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి.

నిన్నటికి నిన్న సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ శ్రీ దేవి చనిపోతే దాన్ని మన తెలుగు మీడియా ప్రసారం చేసిన విధానం అతి జుగుత్సాకరం...ఒక రకంగా ఆ చానెళ్ళని చూడాలంటే చీదర పుట్టించేలా చేశారు...గుండె పోటు అనగానే బోనీ కపూర్ తో ఆస్తుల వివాదం అందుకే గుండె పోటు అని ఒక ఛానెల్, దెయ్యాన్ని చూసి హార్ట్ ఎటాక్ అని ఒక ఛానెల్, తర్వాత బాత్ టబ్ లో పడి మరణించింది అంటే మన చానెళ్ళ ప్రతినిధులు ఏకంగా డిటెక్టివ్ లుగా మారిపోయారు. ఏకంగా బాత్ టబ్ నుండే ప్రసారాలు మొదలెట్టాయి. టీఆర్పీలే కీలకమా దాని కోసం ఎవరి వ్యక్తిగత జీవితాలు అయినా బట్ట బయలు చేసేస్తామా ?

ఏదయినా తుఫానో, భుకంపమో వస్తే సినిమా వాడు స్పందిస్తాడు అలా స్పందించిన సందర్భాల్లో వాళ్ళని అభినందించటానికి రాని నోళ్ళు…వాళ్ళు స్పందించనప్పుడు మాత్రం విమర్శించటానికి తయిక్కుమంటూ వచ్చేస్తాయి. స్పందించకపోతే విమర్శించటం తప్పు లేదు కానీ స్పందించిన రోజు కూడా అంతే బాధ్యత తో అభినందించవచ్చు కదా. ఒక్క విషయం ఆలోచించండి సమాజానికి కీడు జరగనంత వరకు , పక్క వాడికి హానీ జరగనంత వరకు ఎవరి పర్సనల్ విషయాల పై ఒకళ్ళకి అంత ఆసక్తి అవసరం లేదు …

ఎక్కడో ముంబయిలో ఉండే హీరో పడకగది లో ఏమి చేసాడో మనకి అవసరం...కానీ మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు అక్కర్లేదు. ఆంధ్రా లో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రత్యేక హోదా కోసం కాని మన మీడియా కి మాత్రం వర్మ మీద మండిపడ్తున్న మహిళా సంఘాలు బ్రేక్ తర్వాత చూడండి అనే న్యూస్ మాత్రమె కావాలి. సినీ పరిశ్రమే లేకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి లేదు....

ఇది చదివిన తరువాత అయినా సినిమా వాడి పట్ల మీ దృక్పధం మారుతుందని ఆశిస్తూ...ఇక సెలవ్