//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అపర చాణక్యుడు చంద్రబాబు @ 40

Category : editorial

ఇది జరిగి సరిగ్గా 40 ఏళ్ళు...40 ఏళ్ల క్రితం ఇదే రోజు జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ లో ఓ నాయకుడు అదీ ఒక దేశ రాజకీయాన్ని తన చతురతతో ఏలే, దేశ రాజకీయాలలో చక్రం తిప్పగలిగే ఒక రాజకీయ అపర చారణక్యుడు ఈ ఎన్నికల ద్వారానే ఉదయించే సూర్యుడిలా పుట్టుకు వస్తాడు అని ఎవరికీ తెలియదు.

ఒక వేళ ఈ ఎన్నికల్లో ఆ వ్యక్తి ఓడిపోయి ఉంటే ఏం జరిగేది అనేది ఎవరూ ఊహించలేనటువంటి విషయం. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తానే ఒక సమ్మోహన శక్తిగా మారి దేశ రాజకీయాల్లో ఏది జరిగినా అందులో తనదంటూ ఒక ముద్ర వేసేంత స్థాయికి ఎదిగారు.

ఇంతకి ఎవరా వ్యక్తి అంటే అపర భగీరధుడు, అపర చాణక్యుడు, అభివృద్ధి ప్రధాత, రైతు పక్షపాతి, దేశంలోనే విజన్ ఉన్న ఏకైక లీడర్ అంటూ మంచి పేరూ ఉన్నా అదే విధంగా నియంత, సీఈఓ, కరుడు కట్టిన నాయకుడు అని పేర్లు సంపాదించాడు. నియంత, కరుడు కట్టిన నాయకుడు అంటే ఆయన చేసిన అరాచాకాలకి పెట్టిన పేర్లు కావు ఆయన అధికారులతో పని చేయిస్తుంటే అప్పటి దాకా సోమరితనానికి అలవాటు పడ్డ ప్రభుత్వ ఉద్యోగులు పెట్టిన పేర్లు.

చిత్తూరు జిల్లా కుప్పం తాలుకా నారావారి పల్లె లో జన్మించాడు చంద్రబాబు నాయుడు... చిన్నప్పటినుండి ఇంటికి పెద్దకొడుకుగా ఎంతో కష్టపడుతూ వచ్చాడు...స్కూల్ విద్య కోసం శేషాపురం అనే వూరికి నడుచుకుంటూ వెళ్లి చదువుకునే వాడు అంటే విద్య మీద ఆయనకి ఉన్న మక్కువ అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత చంద్రగిరిలోని జెడ్పీ స్కూల్ లో చేరి పడవ తరగతి పూర్తి చేశాడు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.

కాలెజీ రోజుల నుండి ప్రజాసేవ అంటే ఆయనకి ఆసక్తి ఎక్కువ, ముందుగా కుటుంబం కోసం ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినా ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే అసలైన మార్గమని భావించి రాజకీయాల వైపు అడుగులు వేసి కాలేజి రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడు. యూత్ కాంగ్రెస్ లో చేరి కాలేజికి సెలవులు వచ్చినప్పుడు తోటి స్నేహితులను కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలని అందుకున్నారు.

అయితే ఎస్వీ యూనివర్శిటీలో మాత్రమే వినిపించిన ఓ పేరు, దేశ రాజకీయాలను శాసించబోతుందని ఎవరూ ఊహించలేదు. అప్పుడు ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీతో దేశం అల్లకల్లోలం అయిన రోజులు అవి, ఎమర్జెన్సీ ఎత్తేసిన వెంటనే రాజకీయ వ్యూహంతో ముందస్తు ఎన్నికలకి వెళ్ళారు ఇందిర. దీంతో 1977 మార్చిలో లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఎమర్జెన్సీతో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న ఇందిరాగాంధీ... ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయ్యారు.

కానీ ఏ రాజకీయ విశ్లేషకుడు ఊహించని విధంగా ఒక్క ఏపీలో మాత్రమె 42 స్థానాలకు గాను 41 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో జనతా పార్టీ గెలిచింది. కాని ఈ ఎన్నికలయిన 11 నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా జాతీయ స్థాయిలో ఇందిర గ్రాఫ్ పడిపోయి... కాంగ్రెస్ పార్టీ కకావికలం అయ్యింది.

వెనువెంటనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే 'ఆవు దూడ' గుర్తుతో ఉన్న తల్లి కాంగ్రెస్ అలాగే ఉండిపోగా... హస్తం గుర్తుతో కొత్తగా ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటయింది. అప్పటిదాకా కాంగ్రెస్ లో ఉన్న ఎంతో మంది రాజకీయ దురంధరులు చెట్టుకో పిట్టగా ఎగిరిపోయారు. కొద్ది మంది జనతా పార్టీకి వెళ్లగా, మరికొందరు ఒరిజినల్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. కొందరు మాత్రం సాహసం చేసి ఇందిరతోనే ఉండిపోయారు.

ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య 1978 ఫిబ్రవరి 25న సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఏపీ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఇందిరా కాంగ్రెస్ పూర్తిగా చేవలేక పడిఉన్న సమయమది. ఈ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరు అంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేసిన రోజులు. అయితే, అత్యంత కీలకమైన ఏపీని వదులుకోవడానికి ఇందిరాగాంధీ సిద్ధంగా లేరు. దీంతో సరికొత్త ప్రయోగానికి ఆమె శ్రీకారం చుట్టారు.

అదే... యూత్ పాలిటిక్స్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఉత్సాహవంతులైన యువతకు 20 శాతం సీట్లు ఇస్తామని ఇందిర ప్రకటించారు. ఇలా కొత్త ప్రయోగం చేసినా ఇందిన్ర చేసిన ఎమేర్జేన్చి పరిస్థుతుల వల్ల ఇందిరా కాంగ్రెస్ లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని చాలా మంది భావించారు. అలాంటి నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఒకటి.

ఇది జరుగక రెండేళ్ల నుంచి రాజకీయాల్లోకి రావాలని యూనివర్శిటీలో చదువుకుంటున్న చంద్రబాబు ఆలోచనలో ఉన్నారు. ఇందిర ప్రకటించిన యంగ్ పాలిటిక్స్ కి తాను సరిపోతానని భావించిన ఆయన... నేను పోటీ చేస్తానంటూ ముందుకొచ్చారు. అప్పటికి చంద్రబాబు తన వూరి వారికి తప్ప బయట వారికి తెలియకపోయినా... ఇందిర కు అంతకు మించి ప్రత్యామ్నాయం లేదు. దీంతో కేవలం వూరికి, ఎస్వీ యునివర్సిటీకి పరిమితమయిన చంద్రబాబుకు టికెట్ దక్కింది.

ఆయన ప్రత్యర్థి పట్టాభిరామ చౌదరి మామూలు వ్యక్తి కాదు. ఆయన జనతా పార్టీ వ్యక్తి, జిల్లాలోనే ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. ఏ రకంగా చూసినా ఆయన ముందు చంద్రబాబు పనికిరాడు, అదే సమయంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ నాయుడికి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పట్టు ఉన్నా... చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం పట్టులేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గెలవడం అసంభవం.

మాములుగా అయితే చంద్రబాబు ఘోర పరాభవం పాలయ్యేవాడే కానీ, ఓ బలమైన, అనుభవమున్న నేతకు చంద్రబాబు ప్రత్యర్థి. చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు బడా నేతలు కూడా ఎవరూ రాలేదు. పోనీ రాజాకీయ బ్యాక్ గ్రౌండ్ ఉందా అంటే అదీ లేదు. కాని ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆయన ఆశించలేదు. కేవలం తన మిత్రులు, తన అనుకున్న తన సొంత మనుష్యులతో కలసి ఎన్నికల బరిలోకి దిగారు.

ఇంటింటికీ తిరిగారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ, ఓటు వేయమని కోరారు. జనతా పార్టీ, పట్టాభిరామ చౌదరి ల చరిష్మాని ఏమాత్రం తలకి ఎక్కిన్చుకోకుండా గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగారు. ఇక్కడే చంద్రబాబు ఓటర్ల మనసులను గెలుచుకున్నారు. అప్పటిదాకా, తమ ఇళ్లకు వచ్చి ఏ నాయకుడు ఓట్లు అడగలేదు. ఊర్లోకి వచ్చే నేతలు... గ్రామంలోని పెద్దమనుషులను పిలిచి, ఓటు వేయాలంటూ ఆదేశించేవారు.

కానీ, చంద్రబాబు ప్రతి ఒక్కరినీ పత్యక్షంగా కలిశారు. 'ఓటు వేయండమ్మా, ఓటు వేయండన్నా' అని ఎంతో వినమ్రంగా అడిగారు. ఓ అభ్యర్థే వచ్చి స్వయంగా ఓటు వేయమని అడగడంతో... నియోజకవర్గంలోని ప్రజలు పులకించి పోయారు. ఆ యువకుడిలో ఏదో సమ్మోహన శక్తీ ఉందని భావించిన ఓటర్లు... అతనికి మద్దతుగా బ్యాలెట్ పేపర్ పై ఓటు వేశారు. ఫలితం...ఒక బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి... రాజకీయచదరంగం లోనికి ఆ యువకుడు అడుగుపెట్టాడు. ఒక్క గెలుపుతో ప్రారంభం అయిన రాజకీయ ప్రస్థానం ఆ తర్వాత వెనుతిరిగి ఎప్పుడూ చూసుకోలేదు. ఇంతింతై వటుడింతయై అన్న చందాన ఢిల్లీలో చక్రం తిప్పేంత స్థాయికి ఎదిగారు.

1978 ఫిబ్రవరి 25వ తేదీ. ఎంతో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ బూత్ లకు వచ్చిన ఓటర్లు... బ్యాలెట్ పేపరు పై ఓటు వేస్తున్నారు. పోలింగ్ ముగిసింది, ఎన్నికల్లో బలమైన రాజకీయ నేత గెలుస్తారా? లేదా యువతరానికి పట్టం కడతారా? అనే ఉత్కంఠ పెరిగింది. రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 27న ఎన్నికల ఫలితం వచ్చింది. చంద్రగిరి ఓటర్లు పాత తరాన్ని పక్కనపెట్టి, యువకుడైన చంద్రబాబుకు పట్టం కొట్టారు.

2494 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు గెలుపొందారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రానికి, దేశానికి ఒక గొప్ప నేతను చంద్రగిరి ప్రజలు అందించారు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 66 ఏళ్లు. జననేతగా ఆయన వయసు 40 ఏళ్లు. అయినా... 40 ఏళ్ల క్రితం ఉన్న అదే ఉత్సాహం, అదే పోరాటం, అదే కష్టపడే మనస్తత్వం. ఆయన పట్టుదల నేటి యువతకి ఆదర్శం, సాహో చంద్రబాబు అంటూ ఎలుగెత్తి నినదిస్తూ బాబు అడుగుజాడల్లో నడిచేందుకు సమాయత్తం అవుతోంది నేటి ఆంధ్ర ప్రదేశ్ యువతరం.