జగన్ పాదయాత్ర జగన్ ని కోరుకున్న ముఖ్యమంత్రి పదవి అందిస్తుందా...? 3000 కిలోమీటర్లు అధికారంవైపు వెళ్ళే అవకాశం ఉందా...? జగన్ పాదయాత్రలో ఆయనకు కలిసి వచ్చేది ఎంత...? దూరమవుదామనుకుంటున్న నేతలకు ఆయన భరోసా ఇవ్వగలరా...? అంటే ప్రతి ప్రశ్నకు భిన్నమైన సమాధానాలే వ్యక్తమవుతున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం...
పాదయాత్ర" రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా దీనికి విశిష్ట ప్రాధాన్యత వచ్చి చేకూరింది. అప్పటి వరకు తెలుగుదేశం దశాబ్ద కాల పరిపాలనలో పడిన ప్రజలు రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలతో ఆయనకు పట్టం కట్టారు. సుదీర్గంగా సాగిన యాత్రలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే కాకుండా వైఎస్ ని తొలిసారి ముఖ్యమంత్రిని చేసింది.
ఆ పాదయాత్ర చంద్రబాబు రాజకీయ జీవితాన్ని ఒడిదుడుకులకు గురి చేసింది. అప్పటి నుంచి రెండు పర్యాయాలు అధికారానికి దూరమైన చంద్రబాబు రాష్ట్ర విభజన సమయంలో పాదయాత్ర చేసి వైఎస్ తరహా హామీలను ఇస్తూ విభజిత ఆంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. దీనితో పాదయాత్రపై నాయకుల్లో నమ్మకం పెరిగింది.
అధికారానికి దూరమైన నాయకులు పాదయాత్ర చేస్తే అధికారాన్ని అనుభవించవచ్చు అనుకునే భావనలోకి వెళ్ళిపోయారు. అయితే చంద్రబాబు యాత్ర చేసే సమయంలో జగన్ జైల్లో ఉండటంతో జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేసారు. కాని రాష్ట్రం కష్టాల్లో ఉండటంతో చంద్రబాబు కి ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు అధికారం చేపట్టి దాదాపు నాలుగేళ్ళు గడిచిపోయింది.
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. దీనితో ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని నియమించుకున్నారు. ఆయన సలహాతో జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాదయాత్ర చెయ్యడానికే జగన్ నిర్ణయించుకుని అడుగు మొదలు పెట్టారు.
ఈ యాత్రలో జగన్ చేస్తున్న విమర్శలు అంతకు ముందు చేస్తున్న విమర్శలు ఒక్కసారి పరిశీలిస్తే " చంద్రబాబు పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారని " స్పష్టమవుతుంది. ఆయన చెప్పినట్టు అది నిజమేనా అంటే ఎక్కడా కూడా 30 శాతానికి మించి అవుననే సమాధానం రాదు. ఆర్ధిక లోటు ఉన్నా సాగునీటి కష్టాలు తీరుస్తూ , రైతు రుణాలను మాఫీ చేస్తూ ఇలా ప్రజలకు మంచి పాలనే అందిస్తున్నారన్న అభిప్రాయం మెజారిటి ప్రజల్లో ఉంది.
జగన్ చేసే విమర్శలు అన్ని అర్ధ రహితమని వివిధ పార్టీల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అలాగే జగన్ పాదయాత్ర చేస్తారన్న ఆనందం వైకాపా నేతల్లో దూరపు నక్షత్రాల మాదిరి కనిపిస్తుంది. గెలుస్తామనుకున్న వాళ్ళు ధీమాగా ఉన్నప్పటికీ జగన్ యాత్రతో గెలవచ్చు అనుకున్న వాళ్ళు మాత్రం యాత్ర ఖర్చు భరించడానికి ముందుకు రావట్లేదు.దీనితో వారికి జగన్ ఎలాంటి నమ్మకం కలిగించలేకపోతున్నారు.
దీనితో త్వరలోనే మరికొందరు ఫ్యాన్ కింద నుంచి లేచి సైకిల్ ఎక్కడానికి సిద్దమైపోయారు. ఈ పరిస్థితుల్లో జగన్ యాత్ర చేసినా ఆయనకు ఎలాంటి ఫలితం చేకూరుస్తుంది అన్నది చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేసుల వాయిదాలు కొనసాగుతున్న తరుణంలో జగన్ చేస్తున్న యాత్ర పూర్తి అవుతుందా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. వీటిని దాటుకుని జగన్ వచ్చినా ఆయనకు రాజకీయంగా మేలు చేకూర్చినా అధికారం అందించడం మాత్రమె కలే అని చెప్పవచ్చు. చూద్దాం రాజకీయం , వాతావరణం ఒక్కటే కాబట్టి జగన్ వైపు గాలి వీస్తుందో లేక ఇలాగే కొనసాగుతుందో....