Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాలుగు సెకన్లలో ఏటీఎంలను ఏమార్చే గ్యాంగ్ ... షాక్ అయ్యారా

Category : national

నేరాలు రోజురోజుకీ కొత్త రూపు తీసుకుంటున్నాయి. ఎవరు ఎప్పుడు ఎలా చోరీలకు పాల్పడుతున్నారో తెలీటం లేదు. దర్జాగా ఏటీఎం లలో డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న టెక్నిక్‌తో ఏటీఎంలనే ఏమార్చారు. సాంకేతిక సమస్య సృష్టిస్తూ డబ్బులు దోచుకున్నారు. విత్‌డ్రా చేసుకున్నా డబ్బులురానట్లు చూపేలా ఏటీఎంలో మార్పులు చేశారు. ఈ వ్యవహారం మొత్తం 4 సెకన్లలో పూర్తి చేశారు. పైగా బ్యాంకులకు ఫిర్యాదు చేసి మళ్లీ ఆ మొత్తాన్ని తిరిగి పొందారు. ఇదీ హరియానా, రాజస్తాన్‌ సరిహద్దుల్లోని మేవాట్‌ రీజియన్‌కు చెందిన ముఠా నిర్వాకం ఈ టెక్నిక్‌తో భారీ మొత్తంలో డబ్బు దోచేయాలని స్కెచ్‌ వేసి హైదరాబాద్‌ వచ్చిన ఈ గ్యాంగ్‌ సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కింది.

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠాలు చెలరేగిపోతున్నాయి. పాత పద్ధతికి చెక్ పెట్టిన దొంగల ముఠాలు కొత్త టెక్నిక్‌తో నేరాలకు పాల్పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏకంగా ఏటీఎంల నుంచే డబ్బులు దొంగిలిస్తున్నారు. డెబిట్ కార్డు నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకున్న తర్వాత టెక్నికల్ సమస్యలు సృష్టిస్తున్నారు. తమకు డబ్బులు రాకున్నా తీసుకున్నట్టు మెసేజ్‌లు వచ్చాయంటూ బ్యాంకులను మోసం చేస్తున్నారు. ఈ టెక్నిక్‌తో భారీ మొత్తంలో డబ్బు దోచేయాలని స్కెచ్‌ వేసి హైదరాబాద్‌ వచ్చిన ఈ గ్యాంగ్‌.. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కింది.

మేవాట్‌ రీజియన్‌కు చెందిన అఖ్లక్‌ అహ్మద్‌ , ముంథీజ్‌ , తౌఫీఖ్‌ , తస్లీమ్‌ , షాకీర్‌ మహ్మద్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఏటీఎం మెషీన్‌ను ఏమార్చే విధానం గుర్తించారు. పరిచయస్తులు, స్నేహితుల ఏటీఎం కార్డులు తీసుకున్నారు. నాలుగు రోజుల కింద హైదరాబాద్‌ చేరుకున్న ఈ ఐదుగురు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. సెక్యూరిటీ గార్డుల్లేని, పాత ఏటీఎం మెషీన్లను గుర్తించేవారు. తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో లావాదేవీ మొత్తం పూర్తి చేసేవారు. పోలీసులకు చిక్కకుండా సీసీ కెమెరాల కంట పడకుండా పక్కా స్కెచ్ వేసి ఏటీఎంలలో డబ్బును దోచేస్తున్నారు.

ఈ గ్యాంగ్‌ బ్యాంకు హోం బ్రాంచ్‌కు చెందిన ఏటీఎం కేంద్రాలకు వీరు వెళ్లేవారు కాదు. మరో బ్యాంకు ఏటీఎం నుంచి నగదు తీసుకుంటూ ఈ టెక్నిక్‌ వాడేవారు. హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకున్న ఈ గ్యాంగ్‌ 31 కార్డులతో రంగంలోకి దిగింది. ఈ కార్డులు ఇచ్చిన హరియానా , రాజస్తాన్‌కు చెందిన వారంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారే. దీంతో వారికి జీతాలు వచ్చినప్పుడే ఖాతాల్లో డబ్బు ఉంటుంది. ఆ సమయంలోనే ఈ టెక్నిక్‌తో డ్రా చేసుకునే వారు. రాజధానిలోని 7 ప్రాంతాల్లో లక్ష వరకు విత్‌డ్రా చేశారు. ఈ అనుభవంతో వచ్చే నెలలో భారీ మొత్తం కాజేయాలని స్కెచ్‌ వేశారు. ఈలోపు వీరి కదలికలపై సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి ఐదుగురినీ పట్టుకున్నారు.

అయితే, ఏటీఎం మెషీన్‌కు సృష్టించిన సాంకేతిక సమస్యను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. కొన్ని ఏటీఎం మెషీన్లకు ఉన్న ఈ లోపంపై బ్యాంకులకు లేఖ రాసి, లోపాన్ని సరిచేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకూ ఇలాంటి చోరీలపై తమకు బ్యాంక్ అధికారుల నుంచి ఫిర్యాదులు అందలేదని, నిందితులను మరింత సమాచారం రాబట్టి ఏటీఎంలలో కొట్టేసిన డబ్బులు లెక్కతేలుస్తామని చెబుతున్నారు పోలీసులు.

Related News