సౌందర్య ప్రముఖ సినీనటి.ఈమె జులై 18, 1972 లో జన్మించింది. ఈమె తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది.
ఆమె అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది.
తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు గడించి, ఇక్కడ ఆమె విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం మరియు ఒక హిందీ చిత్రంలో నటించింది. హిందీలో ఆమె అమితాబచ్చన్‌తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది.
సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రం నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది.
తెలుగు సినీపరిశ్రమలో అత్యంత ప్రభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు.
అందాల ప్రదర్శనకి బద్ధ వ్యతిరేకి. తెలుగు ప్రజలు ఆమెనెప్పటికీ మరువలేరు. పన్నెండేళ్ళ అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలనందుకొన్నారు. అవి అమ్మోరు (1994), అంత:పురం(1998), రాజా (1999), ద్వీప(2002) (ఉత్తమ నటి మరియు ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు), ఆప్తమిత్ర (2004). కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలు దొనిసగలి,ద్వీప ఆప్తమిత్ర చిత్రాలకై అందుకొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్రబంధం, అంత:పురం చిత్రాలకై అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సౌందర్య.సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు.ఆమెను జూనియర్ సావిత్రి అంటారు.సౌందర్యకు నవరసనటన మయూరి అనే బిరుదుగలదు.
ఈమె తన మేనమామ మరియు తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘును 2003 ఏప్రిల్ 27లో వివాహ మాడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి. ఈమె తాను మరణించే నాటికి 'కామ్లి' అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు, దీనికి దర్శకుడిగా కె.ఎన్.టి.శాస్త్రి వహించేవారు. ఈమె 'అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' ద్వారా తన భర్త మరియు ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్నాటక, ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి పరచారు. ఓ అనాధాశ్రయాన్ని, ఓ పాఠశాల 'అమర సౌందర్య విద్యాలయ' పేరుతో స్థాపించారు.
సౌందర్యకు తల్లి మంజుల, భర్త జీఎస్. రఘు, సోదరుడు అమరనాథ్, అతని భార్య బి. నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో సౌందర్య 2003 ఫిబ్రవరి 15న వీలు రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చెయ్యాలని అమరనాథ్ భార్య నిర్మల 2009లో బెంగలూరు లోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు.
సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. 2013 డిసెంబరు 3 వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.
2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం నుంచి మనరాష్ట్రం లోని కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరానాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణంలో కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు.